21-01-2026 12:42:47 AM
నిజామాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): నిజామాబాద్ బైపాస్ రోడ్డు కుడివైపున వరద నీటి డ్రెయినేజ్ నిర్మాణ పనుల కోసం రూ.6 కోట్లు 17 లక్షల నిధులతో మంగళవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పాల్గొన్నారు. బైపాస్ లహరి హోటల్ ముందు నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర డ్రెయినేజ్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
బైపాస్ రోడ్డుపై వర్షాకాలంలో తరచూ నీరు నిల్వ కావడం, రోడ్డు దెబ్బతినడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. త్వరలోనే పనులు పూర్తి చేసి డ్రెయినేజ్ను వినియోగంలోకి తీసుకురానున్నట్లు ఎమ్మేల్యే భూపతి రెడ్డి తెలిపారు. రహదారులు దెబ్బతినకుండా వరద నీటిని కాల్వల ద్వారా సురక్షితంగా తరలించే విధంగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, పిసిసి ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి, నాయకులు ఉమ్మాజీ నరేష్తోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.