30 August, 2026 | 3:23 AM

జూబ్లీహిల్స్ ఘటనపై సిట్ వేయాలి

30-08-2026 01:16 AM

పోలీసులను బలి చేయొద్దు 

బాధితుడు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదు?   

బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఘటనపై సిట్ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో గ్యాంగ్‌ల ఆగడాలు పెరిగిపోయాయని, తక్షణమే అరికట్టాలని కోరారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 

జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించి బాధితులు ఆస్పత్రికి వెళ్లి మెడికల్ సర్టిఫికెట్లు తీసుకున్నారని, రిజిస్టర్డ్ పోస్టు ద్వారా పోలీసులకు పంపించినా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే కేసు నమోదు చేయలేదా? అని ప్రశ్నించారు.

ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో జరిగితే, ఎఫ్‌ఐఆర్ మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎలా నమోదైందని ప్రశ్నించారు. హరికృష్ణ అనే బాధితుడు తన ఫిర్యాదులో మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ తనను అత్యవసరంగా రావాలని పిలిచారని పేర్కొన్నట్లు తెలిపారు. తాను జూబ్లీహిల్స్ పరిధిలోని ఓ డెన్‌కు వెళ్లిన సమయంలో తనను, తన స్నేహితుడు కిరణ్‌ను రాడ్లతో కొట్టారని బాధితుడు చెప్పినట్లు వివరించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి తక్షణ వైద్యం అందించకుండా పోలీస్‌స్టేషన్‌లోనే ఉంచారని, అతని చేతికి గాయమైందని,  ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని తెలిపారు.