30 August, 2026 | 4:16 AM

కేంద్రం X రాష్ట్రం

30-08-2026 02:07 AM

నీళ్ల నుంచి నిధుల వరకు రగడ

కృష్ణా, గోదావరి జలాలపై భేదాభిప్రాయాలు

నిధులు, ప్రాజెక్టులపై నువ్వా, నేనా?

  1. రాష్ట్ర ప్రయోజనాలపై పంచాయితీ
  2. పెట్టుబడుల విషయంలోనూ పేచీ
  3. రోజురోజుకూ పెరుగుతున్న దూరం సీఎం యూఎస్ టూర్ వివాదంతో మరింత గ్యాప్
  4. తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వొం కేంద్రంలోని బీజేపీ సర్కార్ మధ్య విభేదా లు రోజురోజుకూ ముదురుతున్నాయి. నిధులు, ప్రాజెక్టులు, విభజన హామీలు, కేంద్ర సంస్థల కేటాయింపుల వంటి అంశాలకే పరిమితమైన ఇరు ప్రభుత్వాల మధ్య పోరు..

ఇప్పుడు పెట్టుబడులు, అంతర్జాతీయ పర్యటనలు, నీటి హక్కులు, రాష్ట్ర ప్రయోజనాలు వంటి అంశాలనూ ప్రభావితం చేస్తోంది. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. విభేదాలకు మరింత ఆజ్యం పోశాయి.

అయితే సీఎం విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం సాధారణ పరిపాలనా ప్రక్రియగా కేంద్రం చెబుతున్నప్ప టికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనిని రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధి అవకాశాలతో ముడిపెట్టింది. దీంతో ఒక పరిపాలనా నిర్ణయం కాస్తా రాజకీయ అంశంగా మారింది.

మరోవైపు కృష్ణా, గోదావరి జలాల విషయంలోనూ కేంద్రం సరైన రీతిలో స్పందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తెలంగాణ తన వాటా, హక్కులపై రాజీ ఉండదంటూ కేంద్ర సంస్థలు, బోర్డుల ముందు తన వాదనను బలంగా వినిపిస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోని రాజకీయాలు, పరిపాలన అంశాలు కేంద్రం వర్సెస్ రాష్ట్రం అనే కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. 

సీఎం యూఎస్ పర్యటన అంశంపై..

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించ డాన్ని రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రధాన ప్రాధాన్యతగా పెట్టుకుంది. హైదరాబాద్‌ను గ్లోబ ల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడం, ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్,

డేటా సెంటర్లు, ఏఐ, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లో భారీపెట్టుబడులను తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో సీఎం విదేశీ పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడం ప్రభుత్వానికి రాజకీయంగా ఉపయోగపడే అంశంగా మారింది.

ఇది వ్యక్తిగత పర్యటన కాదు.. తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చే పర్యటన అనే వాదన ద్వారా ఈ అంశం రాష్ట్ర ప్రయోజనాల అంశంగా మారింది. దీంతో తెలంగాణ పెట్టుబడులను ఎవరు అడ్డుకుంటున్నారు? కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తుందా? లేదా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందా?

అనే ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. అయితే కేంద్రం మాత్రం విదేశీ పర్యటనలకు అనుమతులు నిర్దిష్ట నిబంధనలు, ప్రొటోకాల్, జాతీయ ప్రయోజనాల అంశాల ఆధారంగా ఉంటాయని చెబుతోంది. దీంతో రెండు ప్రభుత్వాల వాదనలు పరస్పరం విరుద్ధంగా మారాయి.

దీంతోపాటు కేంద్రం కొన్ని రాష్ట్రాలకు, ముఖ్యం గా గుజరాత్‌కు మాత్రమే ప్రాధాన్యమిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 

నీటి హక్కులపై భిన్నాభిప్రాయాలు

తెలంగాణకు అత్యంత సున్నితమైన అంశమై న నీటి హక్కుల విషయంలోనూ కేంద్రంతో రాష్ట్రానికి పలు సందర్భాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా, గోదావరి జలాల పంపకాలు, ప్రాజెక్టుల అనుమతులు, బోర్డుల పరిధి, నీటి వినియోగం వంటి అంశాలు ఎన్నో ఏళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉ న్నాయి.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నుంచే ‘నీళ్లునిధులు నియామకాలు’ ప్రధాన నినాదాలుగా నిలిచాయి. ముఖ్యంగా కృష్ణా జలాల విషయం లో తెలంగాణకు తగిన వాటా రావాలన్న డి మాండ్‌ను ప్రభుత్వం గట్టిగా వినిపిస్తోంది.

ఏపీతో నీటి పంపకాల వివాదాల్లో కేఆర్‌ఎంబీ, కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ వంటి సంస్థల వద్ద రాష్ట్ర వాదనను బలంగా వినిపించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం చెబుతోంది. అయి తే కేంద్రం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తుందా? లేక తెలంగాణకు న్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటుందా? అని ప్రశ్నిస్తుంది. 

బీజేపీ ఎదురుదాడి

తెలంగాణ ప్రభుత్వం తరచూ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పథకాల వాటా, ప్రాజెక్టుల అనుమతులు, రాష్ట్రానికి సంబంధించిన పెండిం గ్ అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రంపై నిందలు వేస్తోందని బీజేపీ ఎదురుదాడి చేస్తుంది.

కేంద్రం తెలంగాణకు తగిన సహకారం అందించడం లేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సరిగా అమలు చేయడం లేదు.. రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిందిస్తోం దని బీజేపీ వాదిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే కేంద్రంపై ఆరోపణ లు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వాదిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రానికి లభించిన నిధు లు, ప్రయోజనాల వివరాలను సైతం వెల్లడించారు. ఇందులో భాగంగా మూసీ నది పునరుజ్జీ వన ప్రాజెక్టు విషయంలో ఏడీబీ బ్యాంకు ద్వారా తెలంగాణకు రూ.4,100 కోట్ల రుణాన్ని కేంద్రం సులభతరం చేసింది.

మెట్రో ఫేజ్ 50:50 నిధుల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరిం చింది. మెట్రో తొలి దశ విషయంలో ఇప్పటికే కేంద్రం రూ.1,250 కోట్లు అందించింది. మెట్రో మొదటి దశకు సంబంధించిన రుణం తిరిగి చెల్లింపు విధానంపై రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయని,

మెట్రో ఆదాయాన్ని ముందుగా నిర్వహణ, ఆపరేషన్ ఖర్చులకు వినియోగించాలన్నది కేంద్రం అభిప్రాయమని, రాష్ట్రం మాత్రం రుణ చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తోందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి కేంద్ర స హకారాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణలో వరి కొనుగోళ్లకు ఈ ఏడాది కేంద్రం నుంచి రూ.34 వేల కోట్లు అందించామని, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో కేంద్ర సంస్థలు,

కేంద్ర ఆర్థిక సహకారం కీలకంగా ఉందని పేర్కొంటూ వ్యవసాయ రంగంలోనూ కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీ ఆర్థిక సహాయం అందుతోందని బీజేపీ వాదిస్తున్నది. దీంతోపాటు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా గత 12 ఏళ్ల లో తెలంగాణకు దాదాపు రూ. 1 లక్ష కోట్లు రు ణాలు అందించామని కేంద్రం చెబుతోంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వా త కేంద్రం నుంచి తెలంగాణకు రూ.11 వేల కోట్ల వడ్డీలేని దీర్ఘకాలిక రుణాలు అందాయని వాదిస్తున్నది. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదన్న కాంగ్రెస్ ఆరోపణలను కిషన్‌రెడ్డి ఖండిస్తూ కేంద్రం ఇప్పటికే రుణాలు,

ప్రాజె క్టులు, మౌలిక వసతులు, వ్యవసాయ రంగం ద్వారా భారీగా సహకరిస్తోందని చెబుతున్నారు. కేంద్రం మధ్య రాజకీయ విమర్శల కం టే చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకా రం కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు.

కేంద్రం ఏం ఇస్తుంది.. రాష్ట్రం ఏం చేస్తుంది

తెలంగాణకు సంబంధించిన పలు మౌలిక వసతుల, నీటిపారుదల, రవాణా, పరిశ్రమల ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు, పర్యావరణ క్లియరెన్సులు, ఆర్థిక సహకారం లేదా కేంద్ర సంస్థల నిర్ణయాలు అవసరం. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి పెద్ద ప్రాజెక్టు విషయంలో ఏదో ఒక దశలో ఢిల్లీతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రాజెక్టు ముందుకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవడం, ఆలస్యం అయితే కేంద్రాన్ని నిందించడం.. కేంద్రం నుంచి నిధులు వస్తే కేంద్రం తన పాత్రను ప్రచారం చేసుకునే క్రమంలో ప్రాజెక్టులే కేంద్ర రాజకీయ పోటీకి కొత్త వేదికలుగా మారుతున్నాయి. అయితే రాష్ట్రానికి రావాల్సిన నీళ్ల వాటా, కేంద్రం నుంచి నిధుల కేటాయింపు,

ప్రాజెక్టులకు అనుమతులు, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల సృష్టిపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి జలాల వివాదాల పరిష్కారం, పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర సహకారం,

రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టుల అనుమతుల వంటి కేంద్రెేరాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత వివాదాస్పద అంశాలుగా మారే అవకాశం ఉంది. కేంద్ర నిర్ణయం తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే.. అది వెంటనే రాజకీయ వివాదంగా మారే ప్రమాదమూ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

రాష్ట్ర అభివృద్ధి, వనరులు, నీటి హక్కులు, పెట్టుబడులు, ఆర్థిక వనరుల విషయంలో తుది నిర్ణయాధికారంలో రాష్ట్రాల పాత్ర ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే.. బీజేపీ మాత్రం కేంద్రం సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని చెబుతోంది. దీంతో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఏం ఇస్తుంది..

రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కేంద్రం రాజకీయ ఘర్షణ మరింత పదునెక్కే అవకాశముంది.