02-11-2025 01:15:02 AM
ఎన్డీయే కూటమి పాలనలోనే ప్రగతి బాట
కేంద్ర హోమంత్రి అమిత్ షా
పాట్నా, నవంబర్ 1: ఆర్జేడీ పాలనలో బీహార్‌లో ఆటవికరాజ్యం ఉండేదని, లాలుప్రసాద్ యాదవ్, రబ్రీదేవి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మండిపడ్డారు. ఎన్డీయే కూటమి జేడీయూ పాలన వచ్చాకే రాష్ట్రం ప్రగతి బాట పట్టిందని పేర్కొన్నారు. శనివారం న్యూఢిల్లీలో ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఆర్జేడీ పాలనలో నిత్యం ఏదో ఒక చోట దోపిడీ, హత్యలు, దాడులు జరిగేవని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఆర్జేడీ మహాఘట్బంధన్ అధికారంలోకి వస్తే మళ్లీ ఆటవికరాజ్యం వస్తుందని, కాబట్టి బీహార్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం దేశంలోనే అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన రాష్ట్రాల్లో ఒకటని, గడిచిన 20 సంవత్సరాల్లో గణనీయమైన ప్రగతి సాధించిందని వెల్లడించారు.
మ పార్టీ అధికారంలోకి వస్తే బీహార్ యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కోటి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తామని వెల్లడించారు. ఉపాధి అవకాశాలను సృష్టిస్తే వలసలను తగ్గుతాయని, యువతకు స్వయం ఉపాధి కల్పిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఉద్యోగాల కల్పన అనే విషయాన్నే పట్టించుకోవడం లేదని విమర్శించారు.
వారిది మహాఘట్బంధన్(మహాకూటమి) కాదని, మహాథగ్బంధన్ (పెద్ద.. దొంగల ముఠా) అని మండిపడ్డారు. అలాగే మహిళ సాధికారత కోసం ‘సీడ్ మనీ’ యోచన చేస్తున్నామని, తద్వారా వారు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు.