02-11-2025 01:17:07 AM
శ్రీహరికోట, నవంబర్1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల పరంపరలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే మరో కీలక మిషన్‌కోసం సన్నద్ధమైంది. అత్యంత బరువైన పేలోడ్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లగల ఎల్‌వీఎం3 ఎం5 రాకేట్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ రాకెట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ప్రయోగించనున్నారు.
ఈ ప్రయోగం ద్వారా సీఎంఎస్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం లక్ష్యంగా ఇస్రో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే శాస్త్రవేత్తలు రాకెట్ అనుసంధాన పనులను పూర్తి చేసుకుని ఈ వాహక నౌకను శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్ కు సురక్షితంగా తరలించి ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసి కౌంట్ డౌన్ ప్రక్రియను కూడా ప్రారంభించారు.ఈ కౌంట్ డౌన్ ప్రక్రియ 24గంటల సమయం పాటు నిర్విరామంగా కొనసాగిన తర్వాత సరిగ్గా నవంబర్ 2 సాయంత్రం 5.26 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగురుతుంది.
కాగా ఇప్పటివరకూ ప్రయోగించిన ఉపగ్రహాల్లో అత్యంత బరువైనది.. ఇది మొత్తం 25 గంటలు 30 నిమిషాలు కొనసాగుతుంది. అనంతరం 4,400 కిలోల బరువున్న సీఎంఎస్03 ఉపగ్రహాన్ని ఎల్‌వీఎం3 రాకెట్ నింగిలోకి తీసుకెళ్తుంది. ప్రయోగం ప్రారంభమైన 16.09 నిమిషాల తర్వాత ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో విజయవంతంగా స్థాపించనున్నారు శాస్త్రవేత్తలు. ఇస్రో ఇప్పటిరకు ప్రయోగించిన ఉపగ్రహాలలో ఇది అత్యంత బరువైనది. అంటే 4,400 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి.
శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్
ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణన్ శనివారం ఇస్రో బృందంతో కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శిం చుకున్నారు. ఎల్వీఎం-3, సీఎంఎస్ 3 మిషన్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం ప్రయోగనించనున్న బహుబలి రాకె ట్ అని తెలిపారు. భారత్ కమ్యూనికేషన్ల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు.