02-11-2025 01:13:39 AM
మాతృభాషను ప్రోత్సహించేలా చట్టాలు రావాలి
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిమాండ్
బెంగళూరు, నవంబర్ 1: దక్షిణాది రాష్ట్రా ల్లో హిందీ, ఇంగ్లిష్ భాషలు పిల్లల నైపుణ్యాలను బలహీనపరుస్తున్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యా సంస్థల్లో మాతృభాషను ప్రోత్సహించేలా కేంద్ర చట్టం తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. శనివా రం కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన వేడుకలో ఆయన మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం కన్నడపై సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని ఆరో పించారు. హిందీని తమపై బలవంతంగా రుద్దాలని చూస్తోందని అభ్యంతరం వ్యక్తంచేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలు తమ మాతృభాషలోనే విద్యను అభ్యసిస్తారని, మన దేశంలో మాత్రం అందుకు విరు ద్ధంగా ఉందని ఆయన అన్నారు. మాతృభాషను బోధనా మాధ్యమంగా ప్రవేశపెడుతూ కేంద్రం చట్టం తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
విద్య విషయంలో కన్నడ భాష పట్ల జరుగుతున్న నిర్లక్ష్యం రాష్ట్రంలో అనేక సమస్యలకు కారణమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. హిందీ, సంస్కత భాషాభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న కేంద్రం, దేశంలోని ఇతర మాతృభాషల అభివృద్ధికి మాత్రం గ్రాంట్లు మంజూరు చేయ డం లేదని వాపోయారు. కన్నడను వ్యతిరేకించే వారిని రాష్ట్ర ప్రజలు కూడా వ్యతిరేకిం చాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.4.5 లక్షల కోట్ల ఆదాయం వెళుతున్నప్పటికీ, కేంద్రం నుంచి మాత్రం కర్ణాటక అభివృద్ధికి తగిన నిధులు రావడం లేదని ఆయన ఆరోపించా రు. కాగా కేంద్ర ప్రభుత్వానికి, దక్షిణాది రాష్ట్రాలకు హిందీ భాష విషయంలో మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో సిద్ధరామయ్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.