విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం

19-04-2024 02:23:18 AM

కాంగ్రెస్‌కు ఆర్భాటమే తప్ప పనులు చేతకాదు

ఆ పార్టీ అధికారంలోకి వచ్చాకే రాష్ట్రంలో కరువు

బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్

హైదరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉందటే అది తెలంగాణ మాత్రమేనని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు. ఫుడ్ పాయిజన్‌తో ఓ బాలుడు చనిపోవడం ప్రపంచంలోనే అరుదైన సంఘటన అని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనమని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్భాటమే తప్ప పనులు చేతకాని ప్రభుత్వమిదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే కరువు వచ్చిందన్నారు. గత ప్రభుత్వం కృష్ణానీటిని ఏపీకి దోచిపెట్టిందని విమర్శించారు. బీఆర్‌ఎస్ నాయకులు ఉండేది ఇక్కడ కానీ చప్పట్లు కొట్టేది మాత్రం జగన్‌కు అని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్వాకంతో తెలంగాణ ప్రజలు తాగునీటి కష్టాలు పడుతున్నారని అన్నారు.

సమస్యల పరిష్కారం గాలికొదిలేసి సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పేగులు మెడలో వేసుకుంటా, తొక్కుతా అంటూ డైలాగులు కొడుతున్నాడని అన్నారు. నల్లగొండ ఏమవుతుందోనన్న సోయి అక్కడి కాంగ్రెస్ నేతలకు లేదని, సీఎంను ప్రసన్నం చేసుకునే పనిలో వారంతా బిజీగా ఉన్నారని ఆరోపించారు. ఆలీబాబా అరవై దొంగల్లా కాంగ్రెస్ నాయకులు తయారయ్యారని ఎద్దేవా చేశారు. ధరణి సాయంతో బద్వేల్‌లో 400 ఎకరాలు ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కోమటిరెడ్డి సోదరులిద్దరి స్థానాల కింద సీఎం రేవంత్ బాంబ్ పెట్టాడని, రాజగోపాల్ రెడ్డి తన ఇంటికి మాత్రమే హోంమంత్రి అవుతాడని రాష్ట్రానికి కాలేరని చురకలు అంటించారు.