కారులో కోటి
సినీ ఫక్కీలో ఛేజ్.. కారు పల్టీ
ఆ డబ్బు బీఆర్‌ఎస్ నాయకులదే..
వెల్లడించిన కలెక్టర్ వీపీ గౌతమ్
ఖమ్మం, మే 12 (విజయక్రాంతి): పోలింగ్‌కు ముందు నగదు అక్రమ రవాణా, మద్యం పంపిణీ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయం నాయకన్‌గూడెం టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా, హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తున్న ఓ కారును తనిఖీ చేసేందుకు ఆపగా, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. అప్రమత్తం అయిన పోలీసులు పది కిలోమీటర్ల వరకు ఛేజింగ్ చేశారు. ఈ క్రమంలో కారు కూసుమంచి పోలీస్‌స్టేషన్ పరిధిలోని దేవవునితండా వద్ద బోల్తాపడింది. కారులో ఉన్న రూ. కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కారులో ప్రయాణిస్తున్న ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి, డబ్బును ఆదాయపుపన్నుశాఖ అధికారులకు అందజేశారు. కాగా, దేవునితండా వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.కోటి నగదు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులదేనని కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మధిర మండలం నారాయణపురం వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు రూ.1.70 లక్షలు పంపిణీకి తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేశామని వెల్లడించారు. మధిరలో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఓటర్లకు నగదు పంచుతుండగా పట్టుకొని కేసు నమోదుచేశామని తెలిపారు.
కారేపల్లి వద్ద బీజేపీకి చెందిన వారు రూ.3,46,500 ఓటర్లకు పంచడానికి తరలిస్తుండగా నిఘా బృందాలు పట్టుకొన్నాయి. మధిరలో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు ఓటర్లకు పంచడానికి తరలిస్తున్న రూ.4,29,500 జప్తు చేసి, కేసు నమోదు చేశారు. ఖమ్మం ఒకటో టౌన్ పరిధిలో ఓటర్లకు పంచడానికి తీసుకెళ్తున్న రూ.45,650 జప్తు చేసి కేసు నమోదు చేశామని వివరించారు.
ఆర్కే బీచ్ వద్ద కారులో కోటిన్నర..
సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో భారీగా నగదు పట్టుబడుతుంది. తాజాగా వైజాగ్‌లోని ఆర్కే బీచ్ సమీపంలోని పాండురంగాపురం వద్ద ఓ కారులో దాదాపు రూ.౧.౫౦ కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదు తరలిస్తున్నట్టు సీ యాప్ ద్వారా వచ్చిన సమాచారంతో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఓ కారులో అధికారులు నగదును గుర్తించగా, నిందితులు కారును వదిలి పారిపోయారు. ఆ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.






