calender_icon.png 4 October, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంచుకొస్తున్న శక్తి తుఫాన్

04-10-2025 02:24:56 AM

  1. అరేబియా సముద్రంలో వాయుగండం
  2. మహారాష్ట్ర - గుజరాత్ తీర ప్రాంతాలపై ప్రభావం

న్యూఢిల్లీ/అమరావతి, అక్టోబర్ 3: భాతర పశ్చిమ తీరానికి ‘శక్తి’ తుఫాన్ ముంచుకొస్తున్నది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం మారి తుఫాన్‌లా మారింది. ద్వారకకు నైరుతి దిశగా 240 కిలోమీటర్లు, పోర్‌బందర్‌కు పశ్చిమం వైపు 270 కిలోమీటర్ల దూరం నుంచి తీరం వైపునకు దూసుకొస్తున్నది. ఫలితంగా రానున్న 24 గంటల్లో దేశంలోని పలుచోట్ల బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. గుజరాత్  మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం ఈ నెల 6వ తేదీ వరకు ఉంటుందని పేర్కొంది. 

ఉత్తరాంధ్రలో పొంగిన వంశధార

మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వంశధార నది శుక్రవారం ఉప్పొంగి పంట పొలాల్లోకి వరద చేరింది. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 650 ఎకరాల్లో అరటి తోటలు నేలమట్టమయ్యాయి. పంట చేతికొచ్చిన సమయంలో నాశనమైపోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తుఫాన్ తీరం దాటే వరకు మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది.