ముక్కంటిపైకి మంచు ధార
- గాంధీ సరోవర్‌పై భారీ అవలాంచె
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగలేదని వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 30: చార్‌ధామ్ యాత్ర ప్రారంభం కావడంతో కేదార్‌నాథ్‌కు భక్తులు పోటెత్తుతున్నారు. కేదార్‌నాథ్‌లో హిమపాతాల అంతాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. అయితే, ఆదివారం ఉదయం కేదార్‌నాథ్ ధామ్ వెనుక ఉన్న గాంధీ సరోవర్‌పై విపరీతంగా మంచు పేరుకుపోవడం భక్తులను ఆందోళనకు గురిచేసింది. దీని వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని విపత్తు నిర్వహణ అధికారులు ప్రకటించారు. ఈ హిమపాతానికి సంబంధించిన వీడియోను పీటీఐ ఎక్స్ వేదికగా షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.
“గాంధీ సరోవర్ పర్వతంపై తెల్లవారుజామున 5 గంటలకు హిమపాతం సంభవించింది. దీనితో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు” అని రుద్రప్రయాగ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) డాక్టర్ విశాఖ అశోక్ భదానే తెలిపారు. పర్వతం పైనుంచి మంచు గణనీయంగా కిందకి జారడంతో భక్తులు ఆందోళన చెందారు. అయితే, ఈ హిమపాతం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని, అప్పుడప్పుడూ ఇలాంటి హిమపాతాలు సంభవిస్తుంటాయని విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్‌వార్ పేర్కొన్నారు.






