10 July, 2026 | 3:07 AM

డేటింగ్ పేరుతో నిలువు దోపిడీ

01-07-2024 01:07 AM

న్యూఢిల్లీ, జూన్ 30: దేశంలోనే అత్యున్నత ఉద్యోగా లైన సివిల్ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతున్న ఓ యువకు డిని ఓ ముఠా నిలువు దోపిడీ చేసింది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన అమ్మాయి తన వాట్సాప్ నంబర్ పంపటంతో బాధితుడు ఆమెతో చాటింగ్ మొదలుపెట్టాడు. కొద్దిరోజుల తర్వాత ఆమె అతడిని డేట్‌కు ఆహ్వానించింది. అతడు ఆమె చెప్పినట్టే వెళ్లగా ఆమె ఓ కెఫెలోకి తీసుకెళ్లి అతడి ప్రమేయం లేకుండానే ఆర్డర్ ఇచ్చింది. ఆమెను ఆకట్టుకోవాలనే ఉబలాటంలో నిండా మునుగుతున్నానని గుర్తించలేకపోయాడు.

ఆమె మెనూలో లేని పదార్థాలను ఆర్డర్ ఇచ్చినా అతడు గమనించలేదు. కొద్దిసేపటి తర్వాత తనకు అత్యవసర పని పడిందని చెప్పి ఆమె అక్కడి నుంచి జారుకొన్నది. ఆ వెంటనే కెఫె సిబ్బంది బిల్లు తీసుకొచ్చి బాధితుడి చేతిలో పెట్టారు. ఆ బిల్లు అక్షరాలా రూ.2.20 లక్షలు. ఖంగుతిన్న బాధితుడు తిరగబడటంతో కెఫెలో అప్పటికే సిద్ధంగా ఉన్న బౌన్సర్లతో బెదిరించారు. మోసపోయానని గుర్తించి చేసేదేం లేక బిల్లు చెల్లించాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కెఫె యజమాని అక్షయ్ పాహ్‌వాతోపాటు అఫ్సాన్ పర్వీన్ అనే అమ్మాయిని అరెస్టు చేశారు. ఈ దందాలో బాధితుల నుంచి అమ్మాయితో పాటు కెఫె యజమానికి వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు.