వచ్చేనెల నుంచి జనగణన!
- 2026 కల్లా పూర్తి వివరాలు
2021లో కొవిడ్ వల్ల వాయిదా
న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న జనాభా లెక్కల సేకరణను వచ్చే నెలలో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. సెప్టెంబర్ నుంచి జనాభా లెక్కలు సేకరించి 2026 నాటికి పూర్తి వివరాలు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తు న్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. మన దేశంలో ప్రతి పదేండ్లకోసారి జనగణన జరుగుతుంది. అయితే, 2021లో జరగాల్సిన జనగణన కొవిడ్ కారణంగా వాయిదా పడింది. అప్పటి నుంచి కేంద్రం వాయిదా వేస్తూ వస్తున్నది. జనగణనపై ప్రతిపక్షాలు ఇటీవల ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తుండటం, ప్రభుత్వ పథకాల అమలులో ఇబ్బందులు తలెత్తుతుండటంతో ఎట్టకేలకు జనగణన చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.
18 నెలల పాటు గణన
జన గణనకు దాదాపు 18 నెలల సమ యం పడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపింది. జనాభా లెక్కల సేకరణకు పూర్తిస్థాయి ప్రణాళిక రచించటంలో కేంద్ర హోంశాఖ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ నిమగ్నమైనట్టు అధికారులు తెలిపారు. ప్రధాని కార్యాలయం అనుమతి ఇచ్చిన వెంటనే జనగణన ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించిన ఏ అవసరానికైనా 2011 జనాభా లెక్కలనే ఆధారం గా తీసుకొంటున్నారు. అప్పటి నుంచి దేశం లో జనాభా భారీగా పెరిగింది. ఆర్థిక విషయాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. దీంతో ఆర్థిక సర్వేలు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత వంటి కీలక అంశాలను అంచనా వేయటంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.






