ఉద్యోగ సాధనకు స్టడీ సర్కిల్ బలమైన వేదిక
కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
హనుమకొండ, మే 27 (విజయక్రాంతి): నిరుద్యోగ యువత ఉద్యోగ సాధనలో ఎస్సీ స్టడీ సర్కిల్ ఒక బలమైన వేదికగా నిలవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. బుధవారం వడ్డేపల్లి సమీపంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్‌ను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు.
స్టడీ సర్కిల్లో అందిస్తు న్న శిక్షణ కార్యక్రమాలు, గతంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల వివరాలను అధికారులు కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ ఇక్కడ చేరిన ప్రతి విద్యార్థి స్పష్టమైన లక్ష్యంతో కృషి చేస్తూ విజయాన్ని సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ హనుమకొండ జిల్లా అధికారి బి. నిర్మల, స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ కొంగర జగన్మోహన్, వార్డెన్ కృష్ణ, కనకరాజు, కిరణ్ పాల్గొన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
హనుమకొండ, మే 27 (విజయక్రాంతి): పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో నిర్లక్ష్యం తగదని, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరణ తప్పనిసరి అని హనుమకొండ జిల్లా కలెక్టర్, బల్దియా ఇన్చార్జి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా సందర్శించి అభివృద్ధి పనుల పురోగతి, పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ముందుగా గోపాలపూర్ ఊర చెరువు వద్ద ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను పరిశీలించారు.
పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఊర చెరువు డీసిల్టేషన్ టెండర్లు పూర్తయిన నేపథ్యంలో వెంటనే పనులు ప్రారంభించి, వర్షా కాలం ప్రారంభానికి ముందే చెరువును పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని సూచించారు. 56వ డివిజన్లోని గోపాలపూర్ ఊర చెరువు సమీపంలో ‘వేస్ట్ టు ఆర్ట్’ కార్యక్రమంలో భాగంగా చెత్త వేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత జవాన్లు, ఇన్స్పెక్టర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బాలసముద్రంలోని వర్మీ కంపోస్టింగ్ యూనిట్, విండో కంపోస్ట్, బయో కంపోస్ట్ యూనిట్లను పరిశీలించిన కలెక్టర్, బయో కంపోస్ట్ యూనిట్లు 100 శాతం సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో సీఎంఓహెచ్ డాక్టర్ రాజారెడ్డి,జిల్లా ఇరిగేషన్ అధికారి కిరణ్ కుమార్, డీఈ హర్ష వర్ధన్, సూపర్వైజర్ నరేందర్, ఎస్త్స్ర భాషా నాయక్ తదితరులు పాల్గొన్నారు.






