గురుశిష్య వాత్సల్యానికి గుర్తు
ఏ దుర్మూహుర్తాన ప్రభుత్వేతర పాఠశాలలు పురుడుపోసుకున్నాయో గానీ, మాతృభాషకు తీరని అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణం తర్వాత తెలుగు నేలమీద ప్రభుత్వ పాఠశాలల్లో తె లుగు నాలుగు కాలాల పాటు వర్ధిల్లింది.
ఎ ప్పుడైతే విదేశాల్లో ఐ.టి ఉద్యోగావకాశాలు మొదలయ్యాయో, అప్పటినుంచి దేశభాషలకే కాక, తెలుగు భాషకూ బోధనా భాషగా క్షీణ దశ ఆరంభమైంది. తెలుగు మాధ్యమం లో బోధించే పాఠశాలలే కాక, కనీసం ఒక సబ్జెక్టుగా తెలుగు బోధించే పాఠశాలలు కరవయ్యాయి. నేడు సంఘంలో జరిగే అనర్థా లకు ఒక భాషావేత్తగా, మాతృభాషలో విద్యా బోధన జరగకపోవడమే కారణంగా భావిస్తున్నాను. మాతృభాష మాతృస్తన్యం వంటిది. పరభాష పౌడరు పాల వంటింది. మనిషి ఎదుగుదలకు తల్లి లాంటి భాష ఎంతో దోహదం చేస్తుంది.
నాకు తెలిసినంతవరకు 1975 దాకా ఇంచుమించుగా తెలుగు మహర్దశను అనుభవించింది. కానీ, ఆ తర్వాత వచ్చిన ముఖ్య మంత్రుల్లో ఎన్టీఆర్ తప్ప మరెవ్వరూ తెలుగును పట్టించుకోలేదు. నా అదృష్టం కొద్ది తెలుగు మాధ్యమంగా విద్యాబోధన గావిం చే పాఠశాలలో చదివాను. మాతృభాషలో విద్యాబోధన జరిగితే ఏ సబ్జెక్టులో ముందుకేగాలో విద్యార్థికి తెలుస్తుంది. నేను 1966 నుంచి 1970 దాకా నల్లగొండలో, చింతపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నాను. తెలుగు పండితులైన ఎలిశెట్టి బాలకృష్ణతో పాటు, అప్పటి ప్రధానాధ్యాపకులు కొల్లు మధుసూదనరావు తెలుగులో నన్ను బాగా ప్రోత్సహించారు.
పాఠశాలలో జరిగే ప్రతి వక్తృత్వ పోటీలో పాల్గొని నేను బహుమతి పొందేవాణ్ని. స్వయంపరిపాలనా దినోత్సవం నాడు నేను తెలుగు అధ్యాపకుడిగా వ్యవహరించి ఒక పెన్సిల్, ఒక నోట్‌బుక్ బహుమతిగా గెల్చుకున్న సంగతి నాకింకా గుర్తుంది. అదే నా జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది.
చింతపల్లి పాఠశాలలోని అధ్యాపకులందరూ తెలుగు ఇష్టపడేవారు. కనుక, ‘ఉద యిని’ పేరుతో వార్షిక సంచికను వెలువరించేవారు. అప్పుడు నేను 9వ తరగతిలో ఉన్నాను. వార్షిక సంచిక సంపాదకులు కావాలంటే విద్యార్థులు వ్యాసరచనా పోటీ లో పాల్గొని మొదటిస్థానంలో నిలవాలి. మా ప్రిన్సిపాల్ కవిగా, రచయితగా, నవలాకారుడిగా, సంస్కర్తగా ప్రసిద్ధిచెందిన వ్యక్తిని గురించి రెండు పుటల వ్యాసం రాయమన్నారు. నేను కందుకూరి వీరేశలింగం గురిం చి రాసి ప్రథమస్థానంలో నిలిచి ఉదయిని సంపాదకుణ్ని అయ్యాను. మొదటిసారి అధ్యాపకులతో కలిసి ఫొటో దిగే అవకాశం వచ్చింది. ఆ రోజుల్లో దువ్వుకోవడానికి దు వ్వెన ఉండేది కాదు. ‘సరిగా బాల్ దువ్వుకో’ అని నాకు మధుసూదనరావు గారు దువ్వెన ఇచ్చినట్టు జ్ఞాపకం ఉంది. నా వ్యాసం, నా ఫొటో ఉన్న ఆ ఉదయిని వార్షిక సంచిక (57 ఏళ్ల నాటిది) ఇంకా నా దగ్గర భద్రంగా ఉంది. ఒకానొక సమయంలో అడపాల నరసింహారెడ్డి దాన్ని నాకిచ్చారు.
1971లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రా చ్య కళాశాల విద్యార్థినైన తర్వాత, చింతపల్లికి నేనెన్నడూ వెళ్లలేదు. బాలకృష్ణ, శ్యామల య్య, అడపాల అధ్యాపకులతోపాటు మధుసూదనరావు గారిని కలిసే అవకాశం రాలేదు కూడా.
అది 2014వ సంవత్సరం. శాతవాహన విశ్వవిద్యాలయంలో తెలుగు భాషాసేవ చేసిన ప్రముఖులకు పురస్కారాలిచ్చే కార్యక్రమం ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావోత్సవం’ సందర్భంగా ఏర్పాటైంది. అప్పటి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కడారు వీరారెడ్డి పురస్కార ప్రదాతలు. నేను వక్తగా వేదిక మీద కూర్చున్నాను. సభలో ఎవరున్నారో అని ఒక్కసారి తేరిపారజూశాను. మా గురువు కొల్లు మధుసూదనరావు కనిపించారు. వెంటనే వేదిక దిగి వారి దగ్గరికి వెళ్లి పాద నమస్కారం చేశాను. వారెంతో ఆప్యాయంగా శిరస్సును స్పృశించారు. అనుకోకుండా ఆ సభ ద్వారా తిరిగి పరిచయమైన మధుసూదనరావు ఆ తర్వాత నన్ను ఫోన్లో పలకరించడం, నేను మురిసిపోవడం జరిగింది. 8 నాడు త్యాగరాయ సభలో ‘తెలంగాణ తెలుగుభాష సంరక్షణ సమితి’ ఆధ్వర్యంలో జరిగిన సన్మాన సభలో మహాకవి సినారె చేతులమీదుగా మా గురువు పురస్కారం అందుకున్న సందర్భంలోనూ నేనున్నాను.
సామాన్య శాస్త్రోపాధ్యాయులైన మధుసూదనరావుకు తెలుగంటే ప్రాణం. నాలాగే 40 సంవత్సరాల విద్యాబోధనానుభవం కలిగిన మధుసూదనరావు 1998 నుంచి 2005 దాకా తెలుగు పండిత శిక్షణా కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. వారి నేతృత్వంలో ఎంతోమంది గొప్ప తెలుగు పండితులుగా రాణించారు. వారు ఉపాధ్యాయ జగత్తుకు చేసిన సేవ అపారమైంది. వారి సంపాదకత్వంలో 1984 నుంచి ప్రతి నెల ‘పంచాయతీరాజ్ ఉపాధ్యాయ’ సంచిక వెలువడింది.
ఫ్రీలాన్స్ పత్రికా సంపాదకులలో వారొకరు. వారు స్వప్నజీవులు (1967), పైరవీకార్ (1972) అనే ఏకాంకికలు రచించారు. వారి ‘శిక్ష’ (1987) నవల ప్రసిద్ధమైంది. ఎస్వీఎస్ పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో వారివి ఎన్నో పుస్తకాలు ప్రచురితమయ్యాయి. వాటిలో ‘నాణాలు (2013) అనే పుస్తకం వారికి గల ప్రత్యేకాభిరుచిని తెలుపుతుంది. ‘విద్యావిలాసం’ తెలుగులోనూ, హిందీలోనూ రచించారు. విద్యాసంబంధమైన తమ అనుభవాల పేటిక అది.
విశేషించి మధుసూదనరావు పిల్లల కోసం ఏడు పుస్తకాలు రచించారు. వాటిలో నాటికలు, పెద్ద బాలశిక్ష (1992), తప్పక తెలుసుకో (1992), సమైక్యస్వరాలు (1994), బాలకార్మిక నిర్మూలన (2001), అందరి ఆరోగ్యం (1996) పెద్దల ఆదరాభిమానాలను చూరగొన్నవి. వారి వ్యాసాలు అనేక దినపత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‘సమైక్యస్వరాలు’ జాతీయ సమైక్యతను చాటుతున్నవి.
మధుసూదనరావు బోధనా వృత్తిలో, రచనావ్యాసంగంలో చూపిన ప్రతిభకు ఎన్నో జాతీయ పురస్కారాలు లభించాయి. 1992లో అప్పటి రాష్ట్రపతి శంకరదయాళ్ శర్మ చేతులమీదుగా ‘జాతీయ ఉత్తమ అధ్యాపక పురస్కారం’ స్వీకరించారు. 1998లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ద్వారా సీబీఆర్ ట్రస్టు జాతీయ ఉత్తమ అధ్యాపక పురస్కారంతోపాటు యాభై వేల నగదు పారితోషికం అందుకున్నారు. అంతకుముందు 1979లో రాష్ట్రప్రభుత్వం చేత ‘బెస్ట్ టీచర్ అవార్డు’ అందుకున్నారు.
1970 దశకంలో ఆకాశవాణి హైదరాబాద్ వారి ‘బాలానందం’లో ‘స్వప్నజీవులు’, ‘దారితప్పితే’ మొదలైన నాటికలను ప్రసా రం గావించిన మధుసూదనరావుకు మొదటినుంచి పిల్లలంటే అపారమైన ప్రేమ. పిల్లల భవిష్యత్తు మీద అంతులేని నమ్మకం.
అందుకే అధ్యాపకులుగా ఎంతో అనుభవం సంపాదించిన వారు సూర్యాపేటలో ఎం. ఎస్.ఆర్ కిడ్స్ ప్రైమరీ స్కూల్ స్థాఫించి బాలబాలికలను తీర్చిదిద్దుతున్నారు. రెండు మార్లు నన్ను ఆ పాఠశాలకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించి సన్మానించడం మా గురుశిష్య వాత్సల్యానికి ఒక గుర్తు. 2015లో నా అర్ధాంగి ప్రమీల దివంగతురాలైన వార్త తెలుసుకొని, నన్నోదార్చడానికి వారు సతీసమేతంగా మా ఇంటికి వచ్చారు. వచ్చేట ప్పుడు ఒక మామిడి పళ్ల బుట్టను తెచ్చారు. ఆ బుట్టలో ఉన్నవి వారి తోటలో పండిన తియ్యని మామిడిపళ్లు.
గురువులను శిష్యులు మర్చిపోతున్న ఈ రోజుల్లో, ఒక గురువు తన శిష్యుణ్ని వెదుకుతూ ఓదార్చడానికి రావడం శిష్యుడి అదృ ష్టమే అని చెప్పాలి.






