ఓటు కోసం.. సీటు కోసం!
భారత ఎన్నికల సంఘం కేంద్ర పాలకపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ, గత 12 ఏళ్లుగా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి జేబుసంస్థగా మారిందనే ఆరోపణలు, విమర్శలు అనేకం. స్వతం త్ర ప్రతిపత్తి గల ఈ రాజ్యాంగ సంస్థ పక్షపాతంతో అధికారంలో ఉన్న బీజేపీకి వంతపాడుతున్నదని ప్రజాసం ఘాలు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అధికార పార్టీకి అనుకూలంగా లక్షల ఓట్లు తొలగించి విపక్షాల ఓటమికి కారణమైందనే ఆరోపణలు ఈ మధ్యకాలంలో మిన్నంటుతున్నాయి.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పక్కనపెట్టి, ఎలక్షన్ల కమిషనర్లను ఎంపిక చేసే కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించి, కేంద్ర ప్రభుత్వం కొత్త గా తీసుకువచ్చిన చట్టం ఏకపక్షంగా ఉండటంతోనే ఎన్నికల కమిషన్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదనే విమర్శ కూడా ఉంది. ఇటీవల మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీచేసిన తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది.
అయితే, ఈ క్రమంలో ఈసీ వ్యవహరించిన తీరు పై అనుమానాలు రాకమానదు. ఎన్నికలు నిస్సందేహం గా, నిష్పక్షపాతంగా జరగాలి. ఎన్నికల పవిత్రతను కాపాడాల్సిన అంతిమ బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉం టుంది. కానీ, కంచె చేను మేసిందన్నట్లుగా ఎన్నికల సం ఘం నిర్ణయం ఉన్నది. నిజంగానే అభ్యంతరాలు ఉంటే వివరణ కోరాల్సింది. అయితే, ఎన్నికల కమిషన్ అలా చేయలేదు. తెలంగాణలో ఎలాంటి ఎఫ్‌ఐఆర్ లేకుండా, మీనాక్షికి సంబంధం లేని కేసులో వచ్చిన నోటీసులను సాకు చూపి నామినేషన్ తిరస్కరించడం సబబు కాదు. ఈ తతంగం వెనుక బీజేపీ ఉందనే ప్రచారం జరుగుతున్నది.
మొన్నటికి మొన్న తమిళనాడులో గవర్నర్ అవలంబించిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆందోళన కలిగించింది. అక్కడ ప్రజలు ఎన్నుకున్న అతిపెద్ద పార్టీని ప్రమాణస్వీకారానికి పిలువకుండా, రెండు రెండు ఆరు అన్నట్లుగా గవర్నర్ వ్యవహారశైలి ఉన్నది. బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరించి తన సీటు గౌరవాన్ని తగ్గించారు. గవర్నర్‌కు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం చాలా పరిమితమని తెలిసి కూడా కర్రపెత్తనానికి ఒడిగట్టారు. రాజ్యాంగ పరిషత్ చర్చల్లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గవర్నర్ల పాత్రను చాలా స్పష్టంగా వివరించారు.
బ్రిటిష్ పార్లమెంటరీ విధానంలోని ‘ది కింగ్ కెన్ డూ నో రాంగ్’ అనే సూత్రం తెలిసినట్టుగా లేదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం చూసినా తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌కు ముఖ్యమంత్రిగా మొదటి అవకాశం ఇవ్వాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ ఒక్క పార్టీకి లేదా కూటమికి స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అతి పెద్ద పార్టీ నాయకుడిని ఆహ్వానించే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉంటుంది.
అయితే, ఎమ్మెల్యేల సంతకాలు ముందే కావాలని గవర్నర్ పట్టుబట్టారు. ఇది ముమ్మాటికీ గతంలో ఎన్నడూ లేని కొత్త నిబంధనలను సృష్టించడమేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ తతంగాన్ని చూశాక గవర్నర్ వ్యవస్థ అనేది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పావుగా మారిందని అందరికీ అర్థమైపోయింది. మెజారిటీ ఉందో, లేదో తేల్చాల్సింది లోక్‌భవన్ గదుల్లో కాదు కదా? ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి విజయ్ వద్ద మ్యాజిక్ ఫిగర్ లేదని సాకు చూపుతూ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించక, ప్రజా తీర్పును లోక్‌భవన్ అవమానించింది. అసెంబ్లీ వేదికగా మాత్రమే బలనిరూపణ జరగాలని సుప్రీంకోర్టు గతంలో పలు తీర్పుల్లో స్పష్టం చేసిన విషయాన్ని మరువరాదు.
ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు గౌరవం ఇవ్వాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తులు, రాజకీయ ఏజెంట్లుగా మారుతున్నారా? అనే సందేహాలు కలగకమానవు. కాలుకు బలపం కట్టుకొని రెండు రోజుల్లో గవర్నర్‌తో విజయ్ రెండుసార్లు భేటీ అవడాన్ని చూశాక కేంద్రం ఆదేశాలతోనే టీవీకేను గవర్నర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారనే భావన అందరిలో వచ్చింది. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం సంప్రదాయం. రాజ్యాంగాన్ని చదివిన గవర్నర్‌కు ఈ విషయం తెలియనిది కాదు.
కానీ, టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతోనే చిక్కంతా వచ్చింది. విజయ్‌కు హస్తం పార్టీ మద్దతు ఇవ్వడాన్ని బీజేపీ జీర్ణించుకోలేదు. నయానో భయానో లొంగదీసుకోవడానికి అలవాటుపడ్డ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి విజయ్ కొరకరాని కొయ్యలా మారారు. అందుకే విజయ్‌ను ‘సీఎం’గా చూడటం ఇష్టం లేక మెజారిటీ మార్క్ పేరుతో ఆటంకాలు సృష్టించాలని చూసింది. అంతేకాదు, గత 12 సంవత్సరాలుగా బీజేపీయేతర ప్రభుత్వాలకు మోకాలడ్డే పనులు కేంద్రం చేస్తూనే ఉన్నది.
బీజేపీ ప్రభుత్వం సూచనల మేరకు గవర్నర్లు నడుచుకోవడం అనేక సందర్భాల్లో స్పష్టంగా కనిపించింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో బీజేపీకి గవర్నర్లు అవకాశం ఇవ్వడం అబద్ధమా? 2018లో కర్ణాటక ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ నేత యడియూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
కానీ, ఆ తర్వాత బలనిరూపణలో విఫలమై రెండు రోజులకే రాజీనామా చేశారు. 2019లో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం చేశాక, బలం లేకపోవడంతో నాలుగు రోజుల్లోనే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ, తమిళనాట ప్రమాణస్వీకారం చేసేందుకు ముందుగా విజయ్‌కు అవకాశం ఇవ్వకుండా, చీలికలు తెచ్చేందుకు ప్రయత్నించారు. అయినా ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలిసిన విజయ్ 120 మంది సభ్యులను కూడగట్టి ప్రమాణ స్వీకారం చేశారు.
ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని విపక్షాల గొంతునొక్కే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా చేస్తున్నది. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తున్నది. లొంగని ప్రతిపక్ష నేతలపై ఆయా సంస్థలతో దాడులు చేయించడం, పార్టీ ఫిరాయించాక వారిపై ఉన్న కేసులను మాఫీ చేయడం పరిపాటిగా మారింది. బీజేపీ మార్గదర్శకత్వంలోనే ఎన్నికల కమీషన్ ‘సర్’ పేరుతో ఓట్ల చోరీకి పాల్పడుతున్నదనే విమర్శలు ఒకవైపు కొనసాగుతుండగానే, ఏకంగా గెలిచే రాజ్యసభ సీటుపై కుంటిసాకులు చెప్పి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం శోచనీయం. ఇక గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని విపక్ష పాలిత రాష్ట్రాలపై కేంద్రం ఆధిపత్యం చెలాయిస్తున్నది.
గవర్నర్ వ్యవస్థ అనేది స్వతంత్రంగా పనిచేయాలి కానీ, రాష్ట్ర ప్రభుత్వాల పనులకు ఆటంకం కలిగించే స్పీడ్ బ్రేకర్‌లా మారకూడదు. గవర్నర్లు ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులుగా కాకుండా, రాజ్యాంగ రక్షకులుగా వ్యవహరించాలి. సుప్రీంకోర్టు సైతం గతంలో పలు సందర్భాల్లో గవర్నర్ల పరిధిని గుర్తుచేసింది.
మోదీ నాయకత్వంలో రాజ్యాంగ సంస్థలు గతంలో కంటే పారదర్శకంగా పనిచేస్తున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. పీకలదాక అవినీతిలో కూరుకుపోయి, బీజేపీలో చేరిన నేతలకు పెద్దపీట వేసి, అవినీతి రహితంగా పనిచేస్తున్నామని అధికార పక్షం సమర్థించుకుంటున్నది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ ఎన్నికల వ్యవహారంలో ఎన్నికల సంఘం తీసుకున్న చర్యల వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందనే భావన అందరిలో ఉంది. ఈ నేపథ్యంలో ఓటు కోసం, సీటు కోసం, అధికారం కోసం స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థలపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ప్రజాస్వామ్యాన్నే కాదు, రాజ్యాంగాన్ని కూడా ఖూనీ చేస్తున్నదని వస్తున్న విమర్శలను కొట్టిపారేయలేం.
వ్యాసకర్త: కేయూ జర్నలిజం శాఖ విభాగాధిపతి, 9866255355






