14-02-2026 12:00:00 AM
కాంగ్రెస్ 19, బీజేపీ 16, బీఆర్‌ఎస్ 11, ఇండిపెండెంట్లు 3
చైర్మన్ పీఠంపై వీడని ఉత్కంఠ
కామారెడ్డి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ మెజార్టీ కౌన్సిలర్లు గెలుపొందారు. చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీకి చెందినవారు అధిరోహించనున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ని మున్సిపాలిటీలో చైర్మన్ పీఠం పై పీఠముడి విడలేదు. మెజార్టీ స్థానాలు కాంగ్రెస్, బిజెపి, టిఆర్‌ఎస్ పార్టీలు సాధించక పోవడంతో చైర్మన్ ఎవరు అవుతారని ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది కౌన్సిలర్లు, బిజెపికి చెందిన 16 మంది కౌన్సిలర్లు, బి ఆర్ ఎస్ కు చెందిన 11 మంది కౌన్సిలర్లు గెలుపొందగా ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు.
చైర్మన్ పీఠం పొందాలంటే 25 మంది కౌన్సిలర్ల మెజార్టీ ఉంటేనే ఆ పార్టీకి చెందిన వారు చైర్మన్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో ఇండిపెండెంట్ అభ్యర్థుల ముగ్గురిని కాంగ్రెస్లో చేర్చుకోవడంతోపాటు ఎంపీ ఓటు, ఎమ్మెల్సీ ఓటుతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పావులు కలుపుతుంది. బిజెపి కూడా చైర్మన్ పీఠాన్ని దక్కించుకు నాలా వద్ద అనే ఆలోచనలో పార్టీ నేతలు ఉన్నారు.
కామారెడ్డి ఎమ్మెల్యే బిజెపికి చెందిన తాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉండడంతో తన ప్రెస్టేజిక సవాల్ గా మునిసిపల్ ఎన్నికల్లో బిజెపి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. 16 కౌన్సిలర్ స్థానాలను గెలుపొందగా మరికొన్ని స్థానాలు కొద్ది మెజార్టీతోనే చేజారిపోయాయి. బిఆర్‌ఎస్ పార్టీ కి చెందిన 11 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో వారి మద్దతు కాంగ్రెస్కి ఇస్తే చైర్మన్ పీఠం కాంగ్రెస్కు దక్కనుంది.
బిజెపికి మద్దతు ఇస్తే బిజెపి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది. వైస్ చైర్మన్ స్థానాన్ని టిఆర్‌ఎస్ కు ఇస్తే ఆ పార్టీకి చైర్మన్ స్థానానికి మద్దతు తెలిపే ఆలోచనలో బిఆర్‌ఎస్ పార్టీ నేతలు ఉన్నారు. స్థానిక నేతలకు హై కమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోమని చెప్తే అదేవిధంగా నడుచుకునేలా బిఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు మెజార్టీ స్థానాలు దక్కించుకోకపోవడంతో చైర్మన్ పీఠం పై పీఠముడి నెలకొంది.
క్యాంపులోకి వెళ్లిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన కౌన్సిలర్లను క్యాంపుకు తరలించారు. ఇండిపెండెంట్ లను తమ పార్టీలోకి రావాలని ప్రయత్నాలు కాంగ్రెస్ ముమ్మరం చేసింది. బిఆర్‌ఎస్ కౌన్సిలర్లు మద్దతు కీలకంగా మారనుంది. బి ఆర్ ఎస్ కౌన్సిలర్ కాంగ్రెస్కు మద్దతిస్తే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. బిజెపికి బిఆర్‌ఎస్ మద్దతి ఇస్తే చైర్మన్ స్థానాన్ని బిజెపి కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
బి ఆర్ ఎస్ పార్టీ మద్దతు ఎవరికి ఉంటుందో నన్న ఉత్కంఠ నెలకొంది. కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో హంగు తీర్పును ప్రజలిచ్చారు. ప్రధాన పార్టీలకు పూర్తిస్థాయి మెజార్టీ దక్కకపోవడంతో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీకి కీలకంగా మారింది. మొదటి రౌండులో 35 కౌన్సిలర్ స్థానాల రిజల్ట్ ప్రకటించారు. రెండవ విడతలో 14 కౌన్సిలర్ స్థానాల కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించారు. గెలుపొందిన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.
కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమీపంలో నీ గోదాంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువాన్ పరిశీలించారు. ఎన్నికల ఇన్చార్జి అధికారులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మీడియా ప్రతి నిధులతో మాట్లాడారు. కనీస సౌకర్యాలు కల్పించలేదని మీడియా ప్రతినిధులు కలెక్టర్కు వివరించారు.
వెంటనే డిపిఆర్‌ఓ అని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించి పోలీస్ బందోబస్తు తీరును పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం సమీపంలో ఐదుఅంచల భద్రత ఏర్పాట్లను ఏర్పాటు చేయడంతో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు. కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు.