22 May, 2026 | 3:21 AM

గణేష్ గడ్డ దేవాలయానికి ప్రత్యేక ర్యాంపు

22-05-2026 01:54 AM
  1. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 
  2. జాతీయ రహదారి విస్తరణ అధికారులతో సమీక్ష

పటాన్చెరు, మే 21 : జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం లో గల గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక గణపతి దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా  ప్రత్యేక ర్యాంపు, మెట్లు ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం జాతీయ రహదారి విస్తరణ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, ఆలయ కమిటీ పాలకవర్గం, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి దేవాలయం సమీపంలో చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే గణేష్ గడ్డ దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోందని తెలిపారు.

ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా గుడి సమీపంలో చేపడుతున్న పనుల మూలంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ రహదారి నుండి నేరుగా దేవాలయం పరిసరాల్లోకి వచ్చే విధంగా ప్రత్యేక ర్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు, స్వాగత తోరణం నుండి ఆలయం వరకు మెట్ల నిర్మాణం, నూతన ఆర్చి,.గుడి చుట్టూ 50 అడుగుల సామర్థ్యంతో సిసి ఫ్లోరింగ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

నిర్దేశించిన గడువులోగా పైన పేర్కొన్న పనులన్నీ పూర్తి చేయాలని జాతీయ రహదారుల డిఈ రామకృష్ణను ఆదేశించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకపోతే.. గుడి సమీపంలో అండర్ పాసెజ్ సైతం నిర్మించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ గాయత్రి పాండు, స్థానిక కౌన్సిలర్లు రాజు, లత, మాజీ సర్పంచులు సుధీర్ రెడ్డి, వెంకన్న, ఆలయ కమిటీ చైర్మన్ హరి ప్రసాద్ రెడ్డి, ఆలయ ఈవో లావణ్య,  సీనియర్ నాయకులు నర్సింహ రెడ్డి, శ్రీకాంత్, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.