విషాదంగా విహారయాత్ర
గుండం జలపాతంలో మునిగి యువకుడు మృతి
ములుగు, జూలై 19 (విజయక్రాంతి): విహారయాత్ర విషాదంగా మారుతోంది. పది రోజుల వ్యవధిలో ములుగు జిల్లా విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు జలపాతంలో పడి దుర్మరణం పాలైన ఘటనతో విషాదం నెలకొంది. హైదరాబాదుకు చెందిన నలుగురు యువకులు రెండు ద్విచక్ర వాహనాలపై ములుగు జిల్లా వాజేడు మండలం గుండం జలపాతాన్ని సందర్శించడానికి రాగా అక్తర్ ఉద్దీన్( 24) అనే యువకుడు కాలుజారి నీటిలో మునిగిపోయాడు.
ఈత రాకపోవడంతో జలపాతంలో పడ్డ అతని కోసం వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా గంట తర్వాత ఆచూకీ లభ్యమయింది. వెంటనే అతన్ని బయటికి తీసుకువచ్చి తోటి స్నేహితులు సిపిఆర్ చేసి 108 కు సమాచారం అందించారు. ఇది తెలుసుకున్న వాజేడు ఎస్త్స్ర జక్కుల సతీష్ తమ సిబ్బందిని ఆ జలపాతానికి పంపించి. 108 సహాయంతో ఏటూరు నాగారం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువకుడు మృతి చెందాడని వైద్యులు ప్రకటించారు. విహారయాత్ర కాస్త విషాదంగా మారింది.






