23 April, 2026 | 3:17 AM

కోడికూర తినని పల్లె!

27-06-2024 01:13 AM
  • చికెన్, చేపలు రుచించని తండావాసులు 

ఆ తండా కోడళ్లూ కోడికూరకు దూరమే

కంచిరావుపల్లి తండాలో పెళ్లికి ముందే కండీషన్

అనాదిగా వస్తున్న ఆచారమంటున్న పెద్దలు

వనపర్తి, జూన్ 25 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం కంచిరావుపల్లి తండాలో రాత్లావత్ కుటుంబాలకు చెందిన వాళ్లు ఉంటారు.  ఈ తండా వాసులు కోడి, చేపల మాంసానికి దూరంగా ఉంటున్నారు. తినకపోవడమే కాదు, వాటిని ఈ తండాలో అసలు పెంచకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.  సాధారణంగా గ్రామాలు, తండాలు కోడికూతతో తెల్లారితే ఈ తండాలో మాత్రం కోడికూతే వినిపించదు.

కోడికూర మానేస్తేనే కల్యాణం

ఈ తండా అబ్బాయిలను పెండ్లి చేసుకుని వచ్చిన కోడళ్లు సైతం కోడికూర  తినకూడదు. వారు తమ సొంత గ్రామాల్లో తండాల్లో కోడికూర తిన్నా పెండ్లి సంబంధం ఖాయమైనప్పటి నుండి కోడికూర, గుడ్లు, చేపలు తినడం మానేయాల్సిందే. తండాలో పండుగలు వస్తే మాత్రం గొర్రె పొట్టేలు, మేక మాంసం తింటారు.  

గురువు సిద్ధాంతం అనుసరిస్తూ ..

చాలా ఏండ్ల కింద ఈ తండాకు బావోజీ అనే గురువు వచ్చాడు. తండాలో తిరుగుతూ ఉమ్మివేశాడు. ఆ ఉమ్మిని కోడి తినడం చూసి.. అలాంటి కోళ్లను అసలు తినొద్దని ఆదేశించారట. ఆనాటి నుంచి కోళ్లను తినడం కానీ, పెంచడం ఇక్కడ నిషేధంగా వస్తున్నదని తండా పెద్దలు చెబుతున్నారు.  ఒకవేళ ఎవరైనా తింటే వారి కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతారని పేర్కొంటున్నారు. కోళ్లను పెంచి నా అవి ఎక్కువ కాలం బతకవట. నాగుపాములు వచ్చి వాటిని చంపేస్తాయట! ఇదంతా గురువు బావోజీ మహిమ అని తండావాసుల నమ్మకం. 

తండా నేపథ్యం..

వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం కంచిరావుపల్లి తండాలో సుమారు 500 మంది జనాభా ఉంటారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మారుతున్న క్రమంలో కంచిరావుపల్లి తండా సైతం గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ఈ తండా పెబ్బేర్ మండల కేంద్రానికి 7 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ తండాలో తరతరాలుగా ప్రజలు ముసలితనం నుండి మొదలుకుని చిన్నపిల్లల వరకు ఈ మూడింటిన్ని ముట్టుకోరు.

ఊహ తెలిసినప్పటి నుండి ముట్టుకోలె

నాకు ఊహ తెలిసినప్పటి  నుండి మా అమ్మ నాన్న, నేను, నా మనమళ్లు, మనువరాళ్ల వరకు ఎవరు కూడా కోడికూర, గుడ్లు, చేపలు తినలే. తండాలోనే కాదు బయటకు వెళ్లినా  సరే రాత్లావత్ ఇంటి పేరు ఉన్న వాళ్లు ఎవ్వరు ముట్టుకోరు. చాలా ఏండ్ల నుండి అలాగే కొనసాగుతోంది. 

 సామ్లా నాయక్, 

కంచిరావుపల్లి తండావాసి 

ఆచారాన్ని విధిగా పాటిస్తాం

మా తండా వాసులు బయట శుభకార్యాలకు, పండుగలకు ఇతర ప్రాంతాలకు వెళ్లినా ఇక్కడే నివాసం ఉండేవాళ్లు సైతం మా గురూజీ ఆచారాన్ని తప్పక పాటిస్తాం. మా రాత్లావత్ మా వంశం నుంచి తాతలు, తల్లిదండ్రులు సహా ఇప్పటి వరకు ఈ ఆచారాన్ని అందరం పాటిస్తున్నాం.  

 లాల్ నాయక్, 

కంచిరావుపల్లి తండా వాసి