23 April, 2026 | 1:55 AM

4వేల ఇంజినీరింగ్ సీట్లు పెంపు

27-06-2024 01:15 AM

కాలేజీలకు జేఎన్టీయూ ఎన్వోసీలు

ఆకస్మికంగా ఇవ్వడంపై విద్యాశాఖ గుర్రు

ఆరా తీస్తున్న ఉన్నతాధికారులు

గత సీట్లకే కౌన్సిలింగ్ నిర్వహించాలని యోచన

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): జేఎన్టీయూ పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో 4 వేలకు పైగా అదనపు సీట్లకు వర్సిటీ అధికారులు ఎన్వోసీ (నిరభ్యంతర పత్రం)లు జారీచేయడం వివాదాస్పదంగా మారింది. ఆకస్మికంగా అదనపు సీట్లకు ఎందుకు అనుమతి ఇచ్చారన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశంపై విద్యాశాఖ గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. దీని వెనుక పెద్ద దందా నడిచిందన్న ఆరోపణలూ ఉన్నాయి.

ఆ స్థాయిలో అదనపు సీట్లను ఎందుకు ఇచ్చారన్న కోణంలో ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఈ సీట్లకు అనుమతి ఎవరిచ్చారు? ఎందుకు ఇచ్చారు? అన్న కోణంలో ఉన్నతాధికారులు సమాచారం సేకరిస్తున్నారు. మొత్తంగా దీని ప్రభావం కాలేజీల ఆఫిలియేషన్లపై పడింది. దీంతో సీట్ల సంఖ్య తేలకపోవడంతో ఎప్‌సెట్ వెబ్ కౌన్సిలింగ్ వాయిదా పడింది. గురువారం ప్రారంభం కావాల్సిన ఎప్‌సెట్ కౌన్సిలింగ్‌ను జూలై 4వ తేదీకి వాయిదా వేస్తూ ఈ నెల 24న రివైస్డ్ షెడ్యూల్ జారీ చేసిన విషయం తెలిసిందే.

138 కాలేజీల దరఖాస్తు

2024  విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతులిచ్చేందుకు ఏఐసీటీఈ, జేఎన్టీయూలు దరఖాస్తులు స్వీకరించాయి. ఇందుకు రాష్ర్టం నుంచి 138 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఈ ఏడాది పలు కాలేజీలు అదనపు సీట్లకు దరఖాస్తులు సమర్పించాయి. ముఖ్యంగా సీఎస్‌ఈ కోర్సులో అదనపు సీట్ల కోసం అధిక వినతలు వచ్చాయని తెలిసింది. ఇందుకు ఏఐసీటీఈ పచ్చజెండా ఊపగా, జేఎన్టీయూ అధికారులు సైతం అదనపు సీట్లకు ఎన్వోసీలు జారీచేశారు. నిరుడు 8 వేల సీట్లకు అదనంగా అనుమతిచ్చారు. ఈ విద్యా సంవత్సరం సైతం అదనపు సీట్లకు జేఎన్టీయూ ఎన్వోసీలు ఇవ్వడంపై సర్కారు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. దీని వెనుకాల మతలబేంటో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం గతంలో ఉన్న సీట్లకే ప్రస్తుతం అనుమతినిచ్చి, కౌన్సిలింగ్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

ఆఫ్ క్యాంపస్‌లకు నో పర్మిషన్

ఒక కాలేజీ మరో ప్రాంతంలో బ్రాంచీని తెరువడాన్నే ఆఫ్ క్యాంపస్ కాలేజీలంటారు. ఈ ఏడాది ఆఫ్ క్యాంపస్ కాలేజీకు అనుతివ్వరాదని జేఎన్టీయూ నిర్ణయించింది. దీంతో రాష్ర్టం నుంచి ఆఫ్ క్యాంపస్ కాలేజీలకు దరఖాస్తు చేసుకున్న ఐదు కాలేజీలకు అనుమతులొచ్చే పరిస్థితి లేదు. అధికారిక సమాచారం ప్రకారం బీవీఆర్‌ఐటీ, వర్ధమాన్ సహా మరో ౩కాలేజీలు ఆఫ్ క్యాంపస్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌తో పాటు సీఎస్‌ఈ అనుబంధ కోర్సులను నిర్వహించేందుకు దరఖాస్తులు సమర్పించాయి. కొన్ని కాలేజీలు సీఎస్‌ఈ ఏఐఎంఎల్ కోర్సులకు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఆయా కాలేజీలకు ఇప్పుడు అనుమతినివ్వరాదని జేఎన్టీయూ నిర్ణయించింది.