సత్యాన్వేషణలో రాహుల్
ఒక సిద్ధాంతాన్ని నమ్ముకొని నిలబడటం ఆచరించడం, నిర్మాణం చేయడం అనేది మామూలు విషయం కాదు. భారత సమాజంలో భావజాల ధార అనేది ప్రజలని ప్రభావితం చేసే ప్రధానమైన అంశం. ఇప్పటి ఆధునిక కాలమే కాదు, అనాది కాలం నుండి అనేక తర్కాల మధ్య ఘర్షణ, చర్చ అనేది చూస్తూనే ఉన్నాం. సనాతన, బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, గాణపత్య, శాక్తేయ, ఇలా శాఖోపశాఖలుగా అనేక భావజాల జీవధారలు ఈ నేలను సుసంపన్నం చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆధునిక నాగరిక సమా జంలో అనేక రాజకీయ పార్టీలు తమ విచారధారను ప్రజల ముందు ఉంచుతున్నాయి.
దేశ స్వాతంత్య్రం అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దేశభక్తి, ప్రగతి శీల లౌకిక వాదాన్ని తన సిద్ధాంతాలుగా ప్రజల ముం దు పెట్టింది. అప్పటికే ప్రపంచ వ్యాప్తంగా వామపక్ష వాదం బలంగా ఉండటం, అనేక దేశాలు కమ్యూని జాన్ని ఆశ్రయించడం చైనా, రష్యా, యూరోప్ అంతా వామపక్ష భావజాలంలోకి వెళ్లడం సహజంగానే ఆ ప్రభావం భారత్‌పై కూడా పడింది. భారత్‌లో మాత్రం గాంధీయిజం బలమైన ప్రభావం చూపడంతో ఇక్కడ వామపక్ష ప్రభావం నిర్ణయాత్మకశక్తిగా ఎదగ లేకపోయింది.
నెహ్రూ సోషలిస్టు భావజాలం
గాంధీయిజానికి తోడు నెహ్రూ ఆధునిక, ప్రగతిశీల సోషలిస్టు భావజాలం దేశ ప్రజలను ఆకట్టుకుంది. గాంధీ దేశీయ ఆలోచన పండిట్ నెహ్రూ అంతర్జాతీ య సోషలిస్టు భావజాలం కలగలిపి భారత పునర్నిర్మా ణానికి దోహద పడింది. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా లాంటి వారు గాంధీమార్గాన్ని అనుసరించా రు. అలా, గాంధేయ వాదం అంతర్జాతీయం అయ్యిం ది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నిరసిస్తూ మత పరమైన ఏకీకరణ కోసం సాంస్కృతిక పరమైన సంస్థ గా ఏర్పడ్డ ఆర్‌ఎస్‌ఎస్ అనతికాలంలోనే దేశవ్యాపంగా విస్తరించింది.
ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధంగా ఏబీవీపీ, వీహెచ్‌పీ, హిందువాహిని, విద్య, సేవా భారతి లాంటి సంస్థలు వివిధ విభాగాలపై పట్టు సాదించాయి. సంఘ్ మద్దతుదారుల కలయికతో ఆవిర్భవించిన జనసంఘ్ నుండి అనతి కాలంలోనే ‘భారతీయ జనతా పార్టీ’ ఆవిర్భవించడం, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు పూర్తి స్థాయి రాజకీయ విభాగంగా మారడంతోపాటు దేశభక్తి, హిందూత్వ అజెండాగా నూతన రాజకీయ సిద్ధాంతాన్ని భారత ప్రజల ముందు ఉంచారు. బీజేపీ రాకతో రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ ల మధ్య భావజాల ఘర్షణ మొదలైయ్యింది.
ఎందుకిన్ని సంక్షోభాలు?
మునుపు ఎన్నడూ లేని సైద్ధాంతిక ఘర్షణ నేడు భారత రాజకీయాల్లో ప్రధాన చర్చగా సాగుతున్నది. నిజానికి గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విచారధార లేకుండా రాజకీయాలు చేయడంతో బీజేపీ రూపేణా బలమైన భావజాలాన్ని ప్రజల్లో ప్రచారం చేసుకుంది. బీజేపీ హిందుత్వ వాదాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ కొంతమేర నిర్లక్ష్యం చేయడంతో బీజేపీది సైద్ధాంతికంగా పైచేయి సాధించి కాంగ్రెస్ వరుస ఓటములను చవిచూసింది. ప్రతి ఎన్నికలో రాహుల్‌గాంధీ ఎంతగా శ్రమించినప్పటికీ ఫలితాలు మాత్రం ఓటమి అంచుకే చేరుకున్నాయి. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంక్షోభంలోకి జారుకోవడం సీనియర్ నేతలంతా దూరం కావడంతో ఆ పార్టీ చతికిల పడింది.
సైద్ధాంతిక భూమిక కావాలి
రాజ్యం సుభిక్షంగా ఉన్నప్పటికీ ప్రజల దుఃఖాన్ని గ్రహించిన బుద్ధుడిలాగా, పార్టీ శ్రమించినప్పటికి ఫలితాలు రాకపోవడంపై అధ్యయనం చేసిన రాహుల్ గాంధీకి బలమైన సైద్ధాంతిక భూమిక అన్న విషయం బోధపడింది. అప్పటి నుండి అంబేద్కర్ ఇజం, మార్క్సి జం, బుద్ధిజంపై అవగాహన పెంచుకున్న రాహుల్‌గాం ధీ వాటిని ప్రజల్లో ఆచరణలో పెట్టడం ప్రారంభిం చారు. ఇందులో భాగమే భారత్ జోడో యాత్ర. ప్రగతి శీల, సామ్యవాద, సిద్ధాంతాల భూమికతో పార్టీని నిర్మాణం చేయాలన్న దృక్పథంతో ముందుకు వెళుతు న్నారు.
యోగేందర్ యాదవ్, ప్రశాంత్ భూషణ్, ప్రొ.హరగోపాల్, ప్రొ.కంచ ఐలయ్య, కోదండరాం లాంటి మేధావులతోపాటు ప్రముఖ జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో అవగాహన పెంచు కుంటూ ముందుకు సాగుతుండటంతో కాంగ్రెస్ మెరు గుపడుతున్న పరిస్థితి మొదలైంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలలో పూర్వ వైభవా న్ని తెచ్చుకోగలిగింది. బీజేపీ హిందుత్వ సిద్ధాంతానికి భారత జాతీయ దేశీ కోణంలో విరుగుడు కనిపెట్టే పనిలో రాహుల్ గాంధీ రహస్య విప్లవ నిర్మాణానికై అన్వేషణ మొదలు పెట్టారు.
అది విజయాన్ని ముద్దాడే రోజు ఈ దేశం, నూతన రాజకీయ అధ్యాయంలోకి అడుగుపెడుతుంది. కాంగ్రెసుకు పూర్తిస్థాయి అధికారం కైవసం అవుతుంది. దేశ రాజకీయాల్లో భారీ అవమా నాలు మోసిన, మొక్కవోని దైర్యంతో ముందుకు సాగిన రాహుల్‌గాంధీ గొప్ప తత్వవేత్తగా కనిపించే రోజులు సమీపంలో ఉన్నాయి. దేశ రాజకీయాలలో జరుగుతున్న సైద్ధాంతిక పోరులో ఎవరు విజయ తీరాలకు చేరుతారో బిన్నత్వంలో ఏకత్వం ద్వారా యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా ఉన్న భారతదేశం భిన్న సిద్ధాంతాల ఘర్షణలో ఎవరిది పైచేయి అవుతుం దో కాలానికి వదిలేద్దాం.
దొమ్మాట వెంకటేష్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్






