ఆమ్ ఆద్మీ పార్టీ విజయం బీజేపీకి చావుదెబ్బ
ఆప్ రాష్ట్ర కన్వినర్ డాక్టర్ దిడ్డి సుధాకర్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): గుజరాత్, పంజాబ్లలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయం బీజేపీకి చావుదెబ్బ తగిలిందని ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వినర్ డాక్టర్ దిడ్డి సుధాకర్(AAP Telangana State Convener Dr. Diddi Sudhakar) పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పారదర్శక పనితీరు చూసి ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి మరియు కాంగ్రెస్ రెండింటిని ప్రజలు తిరస్కరించారని తెలిపారు. హైదరాబాద్ లిబర్టీ ఆప్ కార్యాలయం నుండి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డాక్టర్ దిడ్డి సుధాకర్ గుజరాత్లోని విసావదర్ స్థానంలో పంజాబ్లోని లూధియానా వెస్ట్ స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయం ఆప్ శ్రేణులకు నూతన ఉత్సాహాన్ని నింపిందని, ఈ ఉపఎన్నికలలో కూడా విజయం సాధించి విజయ ఆధిక్యాన్ని మెరుగుపరిచిందన్నారు. ప్రధాని మోదీ బూటకపు మాటలను, కాంగ్రెస్ పార్టీ చేతగానితనాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయం అని అందుకే ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. ఉప ఎన్నికలలో విజయాలు ఆప్ జాతీయ ప్రణాళికలకు అనుగుణంగా వస్తున్నాయని, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టాలని అలాగే హైదరాబాద్ జూబిలీ హిల్స్ అసెంబ్లీ స్తానం నుండి కూడా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు అయన తెలిపారు.






