08-10-2025 01:08:41 AM
ఢిల్లీ, అక్టోబర్ 7: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ప్రభుత్వం కొత్త బంగ్లాను కేటాయించింది. ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన సుమారు సంవత్సరం తర్వాత కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని అత్యంత ప్రముఖమైన లోధీ ఎస్టేట్‌లో టైప్- సెవన్ బంగ్లాను కేటాయిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. గుర్తింపు పొందిన జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తనకు నివాసం కేటాయించాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కేజ్రీవాల్‌కు 95, లోధీ ఎస్టేట్‌లోని బంగ్లాను కేటాయించారు.
ఆయన ఈ కొత్త ఇంటిని సందర్శించి పరిశీలించారు. సుమారు ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ టైప్- సెవెన్ బంగ్లాలో నాలుగు బెడ్‌ర్రూమ్‌లు, విశాలమైన లాన్లు, గ్యారేజ్, ఆఫీసు స్థలంతో పాటు మూడు సర్వెంట్ క్వార్టర్లు ఉంటాయి. దీంతో కేజ్రీవాల్ అధికారిక నివాస సమస్యకు పరిష్కారం లభించినట్లయింది. గతంలో మాయావతి ఉపయోగించిన 35, లోధీ ఎస్టేట్ బంగ్లాను తమకు కేటాయించాలని ఆప్ కోరినప్పటికీ, దానిని ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి పంకజ్ చౌదరికి కేటాయించారు.
2024 సెప్టెంబర్ 17న ఢిల్లీ ముఖ్య మంత్రి పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్, నవంబర్ 4న 6, ఫ్లాగ్స్టాఫ్ రోడ్‌లోనని అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. అప్పటి నుంచి ఆయనకు అధికారిక శాశ్వత నివాసం లేకుండా పోయింది.
తాత్కాలికంగా పంజా బ్ నుంచి ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్ నివాసంలో (5, ఫిరోజ్షా రోడ్) ఉంటున్నారు. జాతీయ పార్టీ అధ్యక్షులకు పది రోజుల్లోగా అధికారిక వసతి కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం గతంలో ఢిల్లీ హైకోర్టుకు హామీ ఇచ్చింది.ఇదిలా ఉండగా, కేజ్రీవాల్ గతంలో నివాసం ఉన్న 6, ఫ్లాగ్స్టాఫ్ రోడ్ బంగ్లాపై అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఇంటిని ఇప్పుడు ఓ కేఫ్టేరియాతో కూడిన రాష్ట్ర అతిథి గృహంగా మార్చాలని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది.