అభిషేక్
దుమ్మురేపిన ఓపెనర్
పంజాబ్‌పై హైదరాబాద్ విక్టరీ
* ఎదురుగా కొండంత స్కోరు.. తొలి బంతికే విధ్వంసక వీరుడు ట్రావిస హెడ్ క్లీన్ బౌల్డ్! ఇంకేముంది హైదరాబాద్‌కు పరాజయం తప్పదని అంతా ఓ అంచనాకు వచ్చేశారు. కానీ, వాటిని తప్పని నిరూపిస్తూ మరో ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు. దొరికిన బంతిని దొరికినట్లు బౌండ్రీ దాటించిన ఈ చిచ్చర పిడుగు చూస్తుండగానే మ్యాచ్‌ను పంజాబ్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు!
* ఈ సీజన్‌లో మొదట బ్యాటింగ్ చేసినప్పుడు అసాధ్యమైన లక్ష్యాలను నిర్దేశించి.. క్రీడాలోకాన్ని అబ్బురపరిచిన సన్‌రైజర్స్ ఛేదనలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. రెండొందల పైచిలుకు లక్ష్యఛేదనల్లో తేలిపోయింది. దీంతో మరోసారి రైజర్స్‌కు నిరాశ తప్పదేమో అనుకుంటే.. ఉప్పల్‌లో అభిషేక్ బౌండ్రీల ఉప్పెన రేపాడు. ఫలితంగా లీగ్ దశ ముగిసే సరికిహైదరాబాద్ 17 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది!!
6 : ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ రెండొందల పైచిలుకు పరుగులు చేయడం ఇది
ఆరోసారి. ఇందులో మూడుసార్లు 250 ప్లస్ స్కోర్లు నమోదు చేయడం విశేషం.
1 : తాజా సీజన్‌లో అత్యధిక (41) సిక్సర్లు కొట్టిన
ప్లేయర్‌గా అభిషేక్ అగ్రస్థానానికి చేరాడు.
హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: ఈ సీజన్‌లో సొంతగడ్డపై ఆడిన చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేపింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకున్న హైదరాబాద్.. పట్టికలో టాప్ స్థానాల్లో నిలవడమే లక్ష్యంగా బరిలోకి దిగి సత్తాచాటింది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందేమో అనుకుంటే.. రైజర్స్ బ్యాటర్లు ఉప్పల్‌లో పరుగుల సునామీ సృష్టించారు. ఫలితంగా ఆదివారం డబుల్ హెడర్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. కీలక ఆటగాళ్లు దూరమైన సమయంలో పంజాబ్ కేవలం ఒకే ఒక్క విదేశీ ప్లేయర్‌తో బరిలోకి దిగగా.. టాపార్డర్ సమష్టిగా సత్తాచాటింది. ప్రభ్ సిమ్రన్ సింగ్ (45 బంతుల్లో 71; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. అథర్వ (27 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రిలీ రొసో (24 బంతుల్లో 49; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ జితేశ్ శర్మ (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టగా.. కమిన్స్, విజయకాంత్ చెరో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యఛేదనలో హైదరాబాద్ 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (28 బంతుల్లో 66; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. రాహుల్ త్రిపాఠి (18 బంతుల్లో 33; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (37; ఒక ఫోర్, 3 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. ట్రావిస్ హెడ్ (0) విఫలమయ్యాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మెరుపు అర్ధశతకంతో సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
అభిషేక్
పరుగులు : 66
బంతులు : 28
ఫోర్లు : 5
సిక్సర్లు : 6
స్ట్రయిక్ రేట్ : 235.71
ఒకే విదేశీ ప్లేయర్‌తో..
ప్రధాన ఆటగాళ్లు వేర్వేరు కారణాలతో అందుబాటులో లేకుండా పోవడంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఏకైక విదేశీ ప్లేయర్ (రొసో)తో బరిలోకి దిగింది. తాత్కాలిక కెప్టెన్ సామ్ కరన్ స్వదేశానికి తిరిగి వెళ్లడంతో ఈ మ్యాచ్‌లో కింగ్స్‌కు జితేశ్ శర్మ సారథ్యం వహించాడు. పెనర్లు అథర్వ, ప్రభ్‌సిమ్రన్ నిలకడ కనబర్చడంతో పవర్ ప్లే ముగిసే సరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించిన అనంతరం అథర్వను ఔట్ చేసి నటరాజన్ రైజర్స్‌కు బ్రేక్ ఇచ్చాడు. అయినా మిగిలినవాళ్లు కూడా రాణించడంతో పంజాబ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అర్ధశతకం బాదిన ప్రభ్‌సిమ్రన్.. క్లాసెన్ పట్టిన చురుకైన క్యాచ్‌తో వెనుదిరగగా.. ఆఖర్లో జితేశ్ శర్మ మెరుపులు మెరిపించి పంజాబ్‌కు భారీ స్కోరు అందించాడు.
వామ్మో.. ఏందా కొట్టుడు!
విధ్వంసానికి అర్థం మార్చుతూ.. ఈ ఏడాది ఐపీఎల్లో సన్‌రైజర్స్ ఓపెనర్లు విజృంభిస్తుండటంతో పంజాబ్ విధించిన లక్ష్యం చిన్నదే అనిపించింది. అయితే మేఘావృతమైన వాతావరణంలో అర్ష్ దీప్ ఇన్నింగ్స్ తొలి బంతికే రివర్స్ స్వింగ్‌తో హెడ్‌ను బుట్టలో వేసుకోవడంతో రైజర్స్ పనైపోయిందని అంతా భావించారు. అతడి స్థానంలో వచ్చిన రాహుల్ త్రిపాఠి తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు, రెండో ఓవర్‌లో 6,4,4 బాది ఇన్నింగ్స్‌కు ఊపు తేగా.. అక్కడి నుంచి అభిషేక్ ఆట మొదలైంది. అర్ష్‌దీప్ వేసిన మూడో ఓవర్‌లో 4,4,6 కొట్టిన అభిషేక్.. తర్వాత మరో రెండు సిక్సర్లు ఓ ఫోర్ అరుసుకున్నాడు.
స్కోరు రాకెట్ వేగాన్ని అందుకుంది అనుకునే లోపే త్రిపాఠి ఔట్ కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి సాయంతో అభిషేక్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో ఈ యువ ఓపెనర్ 21 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. 10 ఓవర్లు ముగిసే సరికి సన్‌రైజర్స్ 129/2తో నిలిచింది. భారీ షాట్‌లతో బెంబేలెత్తించిన అభిషేక్‌ను శశాంక్ సింగ్ తన తొలి బంతికే పెవిలియన్ పంపడంతో పంజాబ్ కాస్త ఊపరి తీసుకుంది. అయితే నితీశ్, క్లాసెన్ కూడా దంచుడు కొనసాగించడంతో కింగ్స్‌కు ఏ మాత్రం అవకాశమివ్వకుండా హైదరాబాద్ జయకేతనం ఎగరవేసింది.






