calender_icon.png 12 November, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబుల్ కలామ్ ఆజాద్ మహనీయుడు

12-11-2025 12:35:50 AM

 కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 11 (విజయక్రాంతి): భారత రత్న, భారతదేశ తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు సాగాలని  కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపు నిచ్చారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ 137వ జయంతి, మైనార్టీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ఆయన ముఖ్య అతిథిగా, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన తో కలిసి హాజరై మౌలానా  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభివృద్ధికి పునాది వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సేవలు అపారమన్నారు. ఆయన భారత తొలి విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యా విధానానికి పునాది వేయడంతో పాటు పేద, వెనుకబడిన వర్గాల పిల్లల విద్యకు మార్గం చూపారని వివరించారు. మౌలానా ఆజాద్ బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాతంత్య్ర సమరయోధుడు, కవి, రచయిత, విద్యావేత్తగా దేశానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన చూపిన మార్గం నేటికీ విద్యావేత్తలకు, విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.దేశం , రాష్ర్టం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలన్నారు.

కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విద్యాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. అరులందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకుని తమ జీవితాన్ని అభివృద్ధి దిశగా నడిపించుకోవాలని సూచించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి సంజీవరావు, బీసీ వెల్ఫేర్ అధికారిని విజయలక్ష్మి, ఐడిఓసి అధికారులు, సిబ్బంది, అధికారులు  పాల్గొన్నారు.

విద్య ద్వారా పేదరికం నుంచి  విముక్తి: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం, నవంబర్ 11(విజయ క్రాంతి): విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత మొట్ట మొదటి నెహ్రూ నాయకత్వంలోని  క్యాబినెట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ఆయన పుట్టినరోజు సందర్భంగా జాతీయ విద్యా దినోత్సవంగా వేడుకలు నిర్వహిస్తున్నామని  అన్నారు. 

హిందీ, అరబిక్, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ పండితుడని, 11 సంవత్సరాల పాటు విద్యాశాఖ మంత్రిగా పని చేశారని, దేశంలోని అన్ని వర్గాల ప్రజలు చదువుకోవాలని ఆశయంతో కులమత బేధాలు లేకుండా పని చేశారని అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను గుర్తించిన ప్రభుత్వం 1992 లో భారతరత్న అవార్డు అందజేసి గౌరవించిందని  కలెక్టర్ అన్నారు. పేదరికం విద్యతో మాత్రమే దూరమవుతుందని భావించి ప్రతి పేదవాడికి విద్య అందే దిశగా చర్యలు తీసుకున్నారని అన్నారు.  వ్యక్తిగతంగా మతపరమైన సంప్రదాయాలు పాటిస్తూ మనమంతా భారతదేశంలో భాగమని తెలిపారని అన్నారు.

మన రాష్ర్టంలో ప్రభుత్వం మైనారిటీ విద్యపై దృష్టి పెడుతూ  గురుకులాలను ఏర్పాటు చేసిందని,  ప్రత్యేకంగా మైనారిటీ బాలికల విద్య పై దృష్టి సారించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇక్కడ అన్ని కులాలు వర్గాల వారు కలిసి చదువుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డా. బి. కళావతి బాయి, జిల్లా మైనార్టీ శాఖ అధికారి ముజాహిద్, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.