12-11-2025 12:43:32 AM
తంగళ్లపల్లి,నవంబర్ 11(విజయ క్రాంతి): విద్యార్థినులు ప్రణాళిక ప్రకారం చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల సందర్భంగా తంగళ్లపల్లి టీఎంఆర్‌ఈఐఎస్ విద్యాలయం మంగళవారం ఘనంగా నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, బాలకార్మిక నిర్మూలన అంశాలపై ప్రదర్శన ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా ఇంటర్ విద్యార్థులు ఏమి చదువుతున్నారు? తర్వాత ఏమి చదువుతారు? వారు ఆసక్తి ఏంటి? అని ఇంచార్జి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వివిధ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పలువురు టీచర్లకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ను నిర్వాహకులు సన్మానించారు. ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రతి విద్యార్థిని నిత్యం తమ విద్యాలయంలోని లైబ్రరీలో బుక్స్, దిన పత్రికలు చదవాలని సూచించారు.
సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని, పుస్తకాలకు దగ్గరగా ఉండాలని పిలుపు ఇచ్చారు. విద్యార్థిని కుటుంబ నేపథ్యం ఎలా ఉన్నా సరే అత్యున్నత లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. విద్యతోనే వ్యక్తిగత, సామాజిక మార్పు సాధ్యమని పేర్కొన్నారు. పలు ఉదాహరణలు వివరించారు. మంచిగా చదివే వారికే ఉన్నత అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. అన్ని తరగతుల సిలబస్ ఫిబ్రవరిలోగా పూర్తి చేయాలని, గత పది సంవత్సరాల బోర్డ్ పరీక్ష పేపర్స్ తీసుకొని, ఫైనల్ పరీక్ష వరకు సాధన చేయించాలని ఆదేశించారు.
ఈ విద్యాలయం నుంచి విద్యార్థులు వచ్చే ఏడాది పలు జాతీయ విద్య సంస్థల్లో సీటు సాధించాలని ఆకాంక్షించారు.ప్రతి విద్యార్థిని మంచిగా విద్యను అభ్యసించి టీచర్, లాయర్, ఇంజనీర్, డాక్టర్ తదితర వృత్తులు వివిధ ఉద్యోగాల్లో స్థిరపడాలని, ఆర్థికంగా స్వతంత్రత సాధించాలని సూచించారు. ఇష్టపడి చదివి.. ప్రతి సబ్జెక్టులో రాణించాలని, పోషకాహారం నిత్యం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి భారతి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ స్వప్న, తహసీల్దార్ జయంత్, ప్రిన్సిపాల్ ఉర్సా ఫాతిమా. మైనార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.