12-11-2025 12:33:18 AM
-ఎస్పీ రోహిత్ రాజు
-జిల్లా పోలీసులు చేపట్టిన “చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం” కార్యక్రమాలలో భాగంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 11 (విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వ నిషేధిత గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని అందించాలని ఎస్పి రోహిత్ రాజ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎస్పీ పిలుపు మేరకు నవంబర్ 15వ తేదీ వరకు జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాలలో భాగంగా మంగళవారం సుజాతనగర్ పోలీసుల ఆధ్వర్యంలో సుజాతనగర్ సెంటర్ నుండి లక్ష్మిదేవిపల్లి,ఇల్లందు క్రాస్ రోడ్డు వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు.
ఈ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చైతన్యం అనే కార్యక్రమం ద్వారా నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాల బారిన యువత పడకుండా,వారికి అవగాహన కల్పించడం, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం నిరంతర తనిఖీలు చేపట్టడం వంటి కార్యక్రమాలను జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి ప్రజలు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
గంజాయి అక్రమ రవాణా చేసే వారి సమాచారం అందించి భాద్యత గల పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరారు. మత్తుకు బానిసలై యువత తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ గానీ, విక్రయిస్తూ గానీ పట్టుబడితే అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని, అవసరమైతే పీడియాక్టులను నమో దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.1000 మందికి పైగా ఈ ర్యాలీలో స్థానికులు,ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, కొత్తగూడెం 2టౌన్ సీఐ ప్రతాప్, చుంచుపల్లి సీఐ వెంకటేశ్వర్లు,1టౌన్ సీఐ కరుణాకర్,లక్ష్మీదేవిపల్లి ఎస్సు రమణారెడ్డి, సుజాతనగర్ ఎస్సు రమాదేవి పాల్గొన్నారు.