2 September, 2026 | 1:49 AM

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ గేటు తాళానికి ఏబీవీపీ వినతి

02-09-2026 | 12:00am

‘రూ.11,000 కోట్ల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి

నర్సాపూర్ సెప్టెంబర్ 1:  రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రూ.11 వేల కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట నిరసన చేపట్టారు. ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోవడంతో క్యాంప్ ఆఫీస్ గేటు తాళానికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బోడ లక్ష్మణ్ మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్మెంట్ అందక రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమైన పాయింట్లు:

*2 లక్షల మంది డ్రాపౌట్స్: బకాయిలు నిలిచి పోవడంతో ప్రతి ఏటా 2 లక్షల మంది విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని, 4.5 లక్షల మందికి సర్టిఫికెట్లు అందడం లేదని తెలిపారు.

*హామీ ఏమైంది?: గ్రీన్ ఛానెల్ ద్వారా ఫీజులు చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే నిలబెట్టుకోవాలని కోరారు.  నిధులు రాక ప్రైవేట్, బడ్జెట్ కళాశాలలు మూతపడే స్థితికి చేరాయని, అధ్యాపకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

*అసెంబ్లీలో మాట్లాడాలి: రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు విద్యార్థుల రీయింబర్స్మెంట్ సమస్యపై గళమెత్తాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే బకాయిలు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల వేదికగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఉదయ్, శ్రీనివాస్, దశరథ్, సందీప్, గణేష్ పాల్గొన్నారు.