26 June, 2026 | 2:51 AM

అవినీతి తహసీల్దార్ సుచరిత ఇంట్లో ఏబీసీ సోదాలు

26-06-2026 01:25 AM

మొత్తం ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.5.05 కోట్లు.. బహిరంగ మార్కెట్‌లో భారీగా రెట్టింపు

మేడ్చల్, జూన్ 25 (విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా షామీర్‌పేట్ తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన తుమ్మకొమ్మ సుచరిత ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని సుచరిత ఇంటితో పాటు బంధువులు, బినామీల ఇండ్లు మొత్తం నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు.

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలో 2.17 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో మూడు ఫ్లాట్లు, కీసర, ఖానామెట్ ప్రాంతాల్లో రెండు ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా రూ.12 లక్షల నగదు, ఒక వోక్స్‌వేగన్ కారు, ఒక హ్యుందాయ్ క్రెటా కారు, సుమారు రూ.1.20 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు, రూ.38 లక్షల బ్యాంకు నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.

సోదాల్లో ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.5.05 కోట్లుగా అంచనా వేశారు. అయితే స్థిరాస్తుల మార్కెట్ విలువ డాక్యుమెంట్ విలువ కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ పేర్కొంది. మరిన్ని ఆస్తులపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

కాగా సుచరిత అలియాబాద్‌లో భూమి కన్వర్షన్ కోసం ఎకరానికి రూ.లక్ష చొప్పున 30 ఎకరాలకు రూ.30 లక్షలు డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మే 26న డ్రైవర్ ద్వారా రూ.రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె రిమాండ్‌లో ఉన్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.