పోడు రైతుల భూముల్లో మొక్కలు నాటడంపై ఉద్రిక్తత
అటవీశాఖ అధికారులను అడ్డుకున్న రైతులు, ప్రజాప్రతినిధులు
జైనూర్, జూన్ 25 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం రావుజీగూడ గ్రామపంచాయతీ పరిధిలోని పొ లాస గ్రామ శివారులో పోడు రైతులు సాగు చేస్తున్న భూముల్లో అటవీశాఖ మొక్కలు నాటేందుకు చేసిన ప్రయత్నాన్ని రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు.
దీంతో బుధవారం అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 30 మంది అటవీశాఖ సిబ్బంది జేసీబీ సహాయంతో గుంతలు తవ్వి మొక్కలు నాటేందు కు ప్రయత్నించారు. అయితే అవి ఐదు దశాబ్దాలుగా సాగు చేస్తున్న తమ భూములని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ జాదవ్ బహురావు, మాజీ ఉపసర్పంచ్ షేక్ ఖలీల్ ఆధ్వ ర్యంలో పెద్ద సంఖ్యలో రైతులు సంఘటనా స్థలానికి చేరుకుని పనులను నిలిపివేశారు.
ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు ఆ భూములు అటవీ పరిధిలో ఉన్నవని పేర్కొనగా, 1965 నుంచి 21 మంది రైతులు సుమారు 50 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారని, భూములు రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నాయని రైతులు వాదించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.సమాచారం అందుకున్న జైనూర్ సీఐ రమేష్ పోలీసు బృందంతో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
రెవెన్యూ, అటవీశాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి, రైతులు సమర్పించే ఆధారాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులకు సూచించారు.జిల్లా అటవీశాఖ అధికారి ఆదేశాల మేరకే తాము మొక్కలు నాటేందుకు వచ్చామని, రైతులు అడ్డుకుంటే పోలీసు బందోబస్తుతో తిరిగి వచ్చి పనులు పూర్తి చేస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ చొరవతో పరిస్థితి సద్దుమణిగింది.
భూములపై హక్కును నిరూపిం చుకునేందుకు రైతులకు పది రోజుల గడువు ఇస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు.ప్రభుత్వం నుంచి జారీ అయిన ఆదేశాలు, ఇతర సంబంధిత పత్రాలను ఆ గడువులోగా సమర్పించాలని సూచించారు. రైతులు కూడా ఆధారాలు అందజేస్తామని అంగీకరించడంతో అటవీశాఖ సిబ్బంది వెనుదిరిగారు. గడువులోగా ఆధారాలు సమర్పించకపోతే తిరిగి వచ్చి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడతామని అటవీశాఖ అధికారులు పోలీసులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ బహురావు, మాజీ ఉపసర్పంచ్ షేక్ ఖలీల్, పొలాస గ్రామ పటేల్ కురుసంగ్ ప్రసాద్తో పాటు పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.






