ఘోర రోడ్డు ప్రమాదం..
ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు
ఎర్రవల్లి జూన్ 25: మండల పరిధిలోని బీచుపల్లి సమీపంలో గురువారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి గద్వాల వైపు ఐరన్ లోడుతో వెళ్తున్న లారీ బీచుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై టైర్లు పగిలిపోవడంతో నిలిచిపోయింది. అయితే లారీని రోడ్డుపై నిలిపే సమయంలో ఎలాంటి ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
అదే సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ ఘటన స్థలంలోనే మృతి చెందాడు. కారు యజమాని జంషేడ్ అహ్మద్కు తీవ్ర గాయాలు కాగా కర్నూల్ కు, మిగతా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గద్వాల ఆసుపత్రికి తరలించారు.ఘటనపై మృతుడి కుమారుడు శివకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎర్రవల్లి ఏఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.






