4 August, 2026 | 1:49 AM

గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

04-08-2026 12:00 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, ఆగస్టు 3 (విజయక్రాంతి) : పటాన్ చెరు, గుమ్మడిదల మండల పరిధిలోగల గ్రామాలలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సోమవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పటాన్ చెరు, గుమ్మడిదల మండలాల పరిధిలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, పిఆర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతో పాటు సిఎస్‌ఆర్ నిధులు కేటాయిస్తామని తెలిపారు. నందిగామ గ్రామపంచాయతీ పరిధిలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తే. రాబోయే పది రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు. దీని ద్వారా ప్రతినెల గ్రామపంచాయతీకి ఆదాయం లభిస్తుందని తెలిపారు.

భానూరు, క్యాసారం, నందిగామ గ్రామపంచాయతీల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని ఆదేశించారు. గుమ్మడిదల మండల పరిధిలోని అనంతరం, కానుకుంట, కొత్తపల్లి, తదితర గ్రామాల పరిధిలో అంతర్గత రహదారుల నిర్మాణానికి హ్యమ్ ద్వారా నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు డిఈ దీపక్ తెలిపారు.

టెండర్లు పూర్తి చేసిన పనులు ప్రారంభించక పోతే,  సంబంధిత కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీడీవోలు యాదగిరి, ఉమాదేవి, పిఆర్ డిఈ దీపక్, ఎంపీఓ హరిశంకర్ గౌడ్, ఏఈ శశిధర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.