01-10-2025 12:00:00 AM
చెన్నై, సెప్టెంబర్ 30: తమిళనాడు ఎన్నూర్ స్పెషల్ ఎకనామిక్ జోన్ పరిధిలోని థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు కాంక్రీట్ ఆర్చ్ పనుల్లో భాగస్వాములవుతున్నారు. రోజూలాగానే మంగళవారం పనులకు వెళ్లిన కూలీలు పనిచేస్తున్నారు. ఈక్రమంలో 20 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉండే ఇనుప దిమ్మెలు పైనుంచి కూలి కింద పనిచేస్తున్న కూలీలపై పడ్డాయి.
ఘటనలో పది మంది కార్మికులు తీవ్రగాయాలయ్యారు. తోటి కార్మికులు వారిని ఆసుపత్రికి తరలించి, వైద్యం చేయిస్తుండగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వైద్యులు మరో కార్మికుడికి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా అస్సాంకు చెందిన వారని తెలిసింది. ఘటనపై కట్టూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడిని పరామర్శించారు.