5 July, 2026 | 11:57 AM

ఆదివారంపేటలో తెల్లవారుజామున జేసీబీ దగ్ధం

05-07-2026 11:12 AM

యజమాని కన్నీటి పర్యంతం... 

కుట్ర కోణంపై అనుమానాలు

రామగిరి,(విజయక్రాంతి) రామగిరి మండలంలోని ఆదివారంపేట గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న జేసీబీ దగ్ధ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఏలువాక వెంకటేష్ కు చెందిన జేసీబీ తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఘటన సమాచారం అందుకున్న రామగిరి ఎస్ఐ శ్రీనివాస్ వెంటనే పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జేసీబీ ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైందా, లేక గుర్తుతెలియని వ్యక్తులు కావాలనే నిప్పంటించారా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.

దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్ఐ తెలిపారు. ఇక జేసీబీ యజమాని వెంకటేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల కష్టార్జితంతో కొనుగోలు చేసిన జేసీబీ ఒక్కసారిగా అగ్నికి ఆహుతి కావడంతో కన్నీటి పర్యంతమయ్యారు. తన వాహనాన్ని కొందరు కావాలనే కుట్రపూరితంగా దగ్ధం చేసి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. అసలు కారణాలు ఏమిటన్నది పోలీసుల విచారణలో తేలనుంది.