5 July, 2026 | 11:48 AM

సహకార సంఘం రికార్డులు మాయం.. యూరియా సరఫరా నిలిచింది

05-07-2026 11:16 AM

జాయింట్ అకౌంట్ లేక లావాదేవీలు నిలిచిన చిన్నఘనపూర్ పీఏసీఎస్

తీర్మాన పుస్తకాలు, రిజిస్టర్లు కనిపించకపోవడంపై అనుమానాలు

రికార్డులు వెలికితీయాలని చైర్మన్ డిమాండ్

కొల్చారం: మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్నఘనపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో పరిపాలనా వివాదాలు రైతులకు ఇబ్బందిగా మారాయి. మండలంలోని ఇతర సహకార సంఘాలకు యూరియా చేరగా, చిన్నఘనపూర్ సొసైటీకి ఇప్పటివరకు ఒక్క బస్తా కూడా అందకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. సొసైటీ చైర్మన్, సీఈఓల పేర్లపై జాయింట్ అకౌంట్ లేకపోవడంతో నిధుల లావాదేవీలు నిలిచిపోయాయని సమాచారం. ఈ నేపథ్యంలో యూరియా సరఫరా సహా ఇతర కార్యకలాపాలు కూడా స్తంభించినట్లు తెలుస్తోంది.

శనివారం సంఘాన్ని సందర్శించిన సందర్భంగా చైర్మన్ మంద నాగయ్య మాట్లాడుతూ... తనపై గతంలో సుమారు రూ.8 లక్షలకు పైగా నిధుల దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు చేశారని తెలిపారు. అయితే తాను ఖర్చు చేసిన ప్రతి రూపాయికి సంబంధించిన వివరాలు మినిట్స్ బుక్, తీర్మాన పుస్తకాలు, బిల్లుల రిజిస్టర్లలో నమోదై ఉన్నాయని, ప్రస్తుతం అవి సంఘంలో కనిపించడం లేదన్నారు. ఈ విషయంపై సీఈఓను ప్రశ్నించగా, సంబంధిత రికార్డులను జిల్లా సహకార అధికారికి (డీసీఓ) అప్పగించినట్లు తెలిపారని చైర్మన్ చెప్పారు. అయితే డీసీఓ కార్యాలయంలో కూడా ఆ రికార్డులు కనిపించలేదని పేర్కొన్నారు.

మాయం అయిన రికార్డులను అధికారులు వెలికితీసి విచారణ చేపట్టాలని, అందులో నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలితే తన పదవికి రాజీనామా చేసి, లెక్కల్లో తేలిన మొత్తాన్ని సంఘం ఖాతాలో జమ చేస్తానని చైర్మన్ ప్రకటించారు. అప్పటి వరకు సంఘం లావాదేవీలకు తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. జిల్లా సహకార అధికారి వెంటనే జోక్యం చేసుకుని రికార్డుల గల్లంతు ఘటనపై విచారణ జరిపి, జాయింట్ అకౌంట్ సమస్యను పరిష్కరించి, చిన్నఘనపూర్ రైతులకు యూరియా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.