15 April, 2026 | 4:25 PM

అర్హులైన జర్నలిస్టులకు అక్రెటిడేషన్ కార్డులు ఇవ్వాలి

14-04-2026 12:42 AM

టియుడబ్ల్యూజే (ఐజెయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి

సంగారెడ్డి, ఏప్రిల్ 13: సంగారెడ్డి జిల్లాలో నూతనంగా ఏర్పడిన అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో గురించి ఆరా తీశారు.

టీయూడబ్ల్యూజే ఐజేయు సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి, ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు ఆరిఫ్ లు జిల్లా కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా బండారు యాదగిరి మాట్లాడుతూ అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో చాలా సంవత్సరాలుగా అర్హులైన వారు జర్నలిస్టులుగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంతో పాటు నియోజకవర్గ కేంద్రాలలో, మండలాల్లో అర్హులు చాలామంది ఉన్నారని చెప్పారు. వీరందరికీ కూడా సకాలంలో అక్రిడిటేషన్ కార్డులను జారీ చేస్తే బాగుంటుందని వివరించారు.

జిల్లాలో ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో, ఉర్దూ, ఇంగ్లీష్ పత్రికలలో అనేకమంది నిత్యం వార్తలు రాస్తున్నారని చెప్పారు. వారందరికీ కూడా ప్రభుత్వం తరఫున లభించే గుర్తింపు కార్డుగా అక్రిడిటేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు ఎంతమంది దరఖాస్తు చేశారు ?ఇంకా ఎంత మంది దరఖాస్తు చేసే అవకాశం ఉన్నది ?అని అడిగారు. జర్నలిజం కోసం అంకితమై పనిచేస్తున్న వారి పేర్లను ప్రతిపాదిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా ఆమె సూచించారు. సంగారెడ్డి జిల్లా యూనియన్ తరపున తనను ప్రతిపాదించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంఎకే ఫైసల్ లకు బండారు యాదగిరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో డిపిఆర్‌ఓ విజయలక్ష్మితో పాటు సభ్యులుగా నియమితులైన యోగానంద రెడ్డి, శ్రీధర్, వై ప్రభాకర్, జి ప్రభాకర్, ఆరిఫ్, అక్రముద్దీన్, మురారి, సిద్ధిక్ అహ్మద్ పాల్గొన్నారు.