స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థికంగా ఎదగాలి
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకుని ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి
ప్రభుత్వం శిక్షణ, రుణాలు అందిస్తుంది
విజయవంతం చేయాల్సిన బాధ్యత లబ్ధిదారులదే జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి,(విజయక్రాంతి): స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ... స్వయం ఉపాధి శిక్షణలో తొలి బ్యాచ్‌లో 1,200 మంది శిక్షణ పొందడం అభినందనీయమని తెలిపారు. తొలి బ్యాచ్ సాధించిన విజయాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలిచి స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
మహిళలు తమ ప్రతిభను, నైపుణ్యాలను పరిమితం చేసుకోకుండా సృజనాత్మకంగా ఆలోచిస్తూ కొత్త అవకాశాలను అన్వేషించాలని సూచించారు. సంప్రదాయ కోర్సులకే పరిమితం కాకుండా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న రంగాల్లో నైపుణ్యాలు పెంపొందించుకుని స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని తెలిపారు. మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపారాలు ప్రారంభించాలని, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి చిన్న తరహా యూనిట్లను ఏర్పాటు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ కోసం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), వీ-హబ్‌తో అవసరమైన అనుసంధానాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. టామ్‌కామ్ ద్వారా విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా జర్మనీ, జపాన్ దేశాల్లో నర్సులకు అధిక డిమాండ్ ఉందని తెలిపారు. ఆసక్తి ఉన్న వారికి అవసరమైన శిక్షణ అందిస్తామని వెల్లడించారు.
ప్రభుత్వం తరఫున శిక్షణ, తక్కువ వడ్డీపై రుణాలు, ఇతర సహాయ సహకారాలు అందిస్తామని, అయితే వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత లబ్ధిదారులదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. యూనిట్‌పై పూర్తి యాజమాన్య భావనతో పనిచేస్తేనే విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగగలరని అన్నారు.
స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేలా అవసరమైన నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక సహాయం, ఇతర మద్దతును జిల్లా యంత్రాంగం అందిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీజీఎం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నట్రాజ్ ఎల్.డి.ఎం. ప్రవీణ్ కుమార్, ఏపీ డి.రవీందర్,డి.పి.ఎం.రమణ, ఆర్.శెట్టి.డైరెక్టర్ వెంకటేష్, సంబంధిత శాఖల అధికారులు, యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ప్రతినిధులు, శిక్షణ పొందిన అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.






