తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుపై ఎమ్మెల్యే వైఖరి తెలపాలి
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ విషయంలో స్థానిక శాసనసభ్యులు తన వైఖరి ఏమిటో తెలపాలని సోనాల మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గాజుల పోతన్న డిమాండ్ చేశారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ... మండల కేంద్రానికి నూతనంగా మంజూరి కానున్న పబ్లిక్ స్కూల్ విషయంలో స్థానికుల డిమాండ్ ను గుర్తించి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను నిర్మించే విధంగా ఎమ్మెల్యే చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
మండల వాసుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన తన వైఖరి ప్రకటించాలన్నారు. ఎమ్మెల్యే వైఖరి ఏమిటనేది తెలవకపోవడంతో స్థానికులు అనుమానాలను వ్యక్తపరుస్తున్నారన్నారు. మంజూరైన పాఠశాలను ఎక్కడికి తరలించవద్దని తరలిస్తే ఉద్యమాలు చేయాల్సి ఉంటుందన్నారు. మండల కేంద్రంలో ఇంటర్ కళాశాల లేదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్ డిమాండ్ తెరపైకి వచ్చిందన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇక్కడే నిర్మాణం జరిగేలా చూడాలని ఆయన కోరారు.






