21 August, 2026 | 2:23 PM

ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు చంచల్‌గూడ జైలుకు

23-05-2024 03:50 AM

14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ 

ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.౫౦ కోట్లు!

ఏసీపీ డైరీలో ఉన్న పేర్లపై ఏసీబీ నజర్ 

సీసీఎస్‌కు క్యూ కట్టిన బాధితులు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 22 (విజయక్రాంతి): ఆదాయానికి మించి న ఆస్తుల కేసులో అరెస్టయిన హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్‌రావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ నాంపల్లి ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఉమామహేశ్వర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామునే అశోక్‌న గర్‌లోని ఏసీపీ ఇంటికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు.

వేర్వేరు బృందా లుగా ఏర్పడిన అధికారులు ఉమామహేశ్వర్‌రావు సోదరుడితో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కలిపి మొత్తం 14 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.37 లక్షల నగదు, 600 గ్రాముల బంగారు ఆభరణాలు, 17 ప్రాంతాల్లో ఉన్న స్థిరాస్తుల పత్రాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.3.95 కోట్లుగా నిర్ధారించారు. ఉమామహేశ్వర్ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.50 కోట్ల వరకు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.  

భారీగా అక్రమాస్తులు..

ఉమామహేశ్వర్‌రావు అవినీతి సొమ్ముతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అక్రమాస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అందులో రెండు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 17 స్థిరాస్తులు, ఘట్‌కేసర్‌లో 5 ప్లాట్లు, శామీర్‌పేటలో ఓ విల్లా,  వైజాగ్‌లో విలువైన స్థలం ఉన్నట్లు తెలిపారు. అలాగే రెండు బ్యాంకు లాకర్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 1995 బ్యాచ్‌కు చెందిన ఏసీపీ ఉమామహేశ్వర్‌రావు అబిడ్స్, జవహర్‌నగర్, సీసీఎస్, సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్‌గా, ఇబ్రహీంపట్నం, సీసీఎస్ ఏసీపీగా పనిచేశారు. ఇటీవల సీసీఎస్ ఏసీపీగా పలు కీలక కేసులలో విచారణ అధికారిగా పెద్ద మొత్తంలో అవినీతి సొమ్మును కూడబెట్టినట్లు అధికారులు భావిస్తున్నారు.  

సీసీఎస్‌కు క్యూ కట్టిన బాధితులు..

ఏసీపీ ఉమామహేశ్వర్‌ను ఏసీబీ అరెస్ట్ చేయడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఈ క్రమంలో సీసీఎస్ పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టారు. తమను వివిధ రకాలుగా బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేశాడని వాపోయారు. ఏసీపీపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

కీలకం కానున్న డైరీ...

ఉమామహేశ్వర్‌రావు డైరీలో చాలా మంది పేర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఈ పేర్లలో సందీప్ అనే వ్యక్తి పేరు ప్రముఖంగా ఉన్నట్లు సమాచారం. ఆ పేరుతో పోలీసు డిపార్ట్మెంట్‌లో చాలా మంది ఉన్నారని, వాటిపై విచారణ చేస్తామని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. అలాగే సాహితి ఇన్‌ఫ్రా అనే ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కేసులో ఉమామహేశ్వర్‌రావు విచారణ అధికారిగా ఉన్నారు. తనకు ఉన్న అధికారాలను అడ్డం పెట్టుకొని బాధితుల వివరాల ఆధారంగా సాహితి కంపెనీ డైరెక్టర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఓ పోలీసు అధికారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు కావడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.