రుణమాఫీపై కాంగ్రెస్ దగా
100 రోజుల్లో రుణమాఫీ ఎక్కడ?
బోనస్ సన్న వడ్లకే ఇస్తామంటోంది
కౌలుదార్లకు రైతు భరోసా ప్రస్తావనే లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
హైదరాబాద్,మే 22(విజయక్రాంతి): అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని హామీనిచ్చి నెరవేర్చకుండా అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా మని ప్రకటించినా పార్టీ ఇంతవరకు దాని ప్రస్తావన కూడా తేలేదన్నారు. ఎన్నికల ముందు రైతు భరోసా కింద కౌలుదార్లకు రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారని, వరి పంటకు రూ.500 బోనస్ ఇస్తామని నమ్మబలికినట్లు చెప్పారు. గతంలో ఇచ్చిన హమీలను మరిచిన ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల సమయంలో మళ్లీ అనేక రకాల కొత్త హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ నాయకులు దేవుళ్లపై ఒట్లు పెడుతూ ప్రజలకు పంగనామాలు పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడు తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినోత్సవం సందర్భంగా రూ.2 లక్షల రైతు రుణమాపీ చేస్తామని చెప్పి ఇంత వరకు ప్రకటించలేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సోనియాగాంధీ దెయ్యమంటూ తిట్టిన సీఎం రేవంత్ ఇప్పుడు దేవత అంటూ పొగడటం విడ్డూరంగా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తోందని ఆరోపించారు. అప్పులు కట్టవద్దు, ఒకవేళ కడితే వెంటనే కొత్తగా రుణాలు తీసుకోవాలని, తాము వచ్చాక రుణమాఫీ చేస్తామని రైతులను నమ్మించేలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రచారం చేశారని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.
70 శాతం దొడ్డు రకాలే..
వరి పంటకు రూ.500 బోనస్ అని చెప్పిన కాంగ్రెస్ ప్రస్తుతం సన్నవడ్లకు మాత్రమే అంటూ తాజాగా ప్రకటించిందన్నారు. రాష్ట్రంలో సన్న వరిని తక్కువ మంది సాగు చేస్తున్నారని తెలిపిన ఆయన వానకాలంలో 70 శాతం పైగా దొడ్డురకం వరి పండిస్తారని చెప్పారు. రైతుల నుంచి దొడ్డుబియ్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పడు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి న ఇబ్బంది ఏమిటని ఆయన ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ ఎంత వచ్చినా రైతుల నుంచి కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి గతంలోనే ప్రకటించారని గుర్తుచేశారు.
దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లు కేంద్రం అన్ని రకాలుగా చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ముందుకు వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన 22 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేంద్రానికి సరఫరా చేయాల్సి ఉండగా ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదన్నారు. రైతుల నుంచి సకాలంలో వరిధాన్యాన్ని సేకరించకుండా అకాల వర్షాలకు ధాన్యం నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం నోరెళ్లపెట్టి చూస్తుందన్నారు. అకాల వర్షంతో కల్లాల్లోని ధాన్యం తడిసి మొలకెత్తుతున్నా కొనుగోళ్ళు మాత్రం మందకొడిగా సాగుతున్నాయన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై 5 సంవత్సరాల్లో రావాల్సిన వ్యతిరేకత కేవలం 5 నెలల్లోనే కూడగట్టుకుందన్నారు. మొదటి నుంచి యావత్ భారతదేశాన్ని మోసం చేస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహిస్తామంటూ చెబుతున్న కాంగ్రెస్ ఏ ప్రాతిపదికపై సోనియాను ఆహ్వానిస్తారని ఆయన ప్రశ్నించారు. అనేక త్యాగాలు, పోరాటాలతో సకల జనుల సమ్మె చేసి అప్పటి యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నామన్నారు.






