18 June, 2026 | 1:44 AM

మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు

18-06-2026 12:00 AM

జిల్లా కలెక్టర్ కె.హైమావతి 

సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 17: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం చిన్నకోడూరు మండలం రామంచ ప్రభుత్వ ప్రాథమిక, జడ్పీ ఉన్నత పాఠశాలలు, సిద్దిపేట అర్బన్ మండలంలోని ఇమాంబాద్ అప్పర్ ప్రైమరీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రామంచ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి స్వయంగా భోజనం వడ్డించారు. రామంచ జడ్పీ ఉన్నత పాఠశాలలో మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడంపై ప్రధానోపాధ్యాయురాలిపై ఆగ్రహం వ్యక్తం చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇమాంబాద్ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచడంతో పాటు మెనూను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. పాఠశాల ఆవరణలు, తరగతి గదులు, వంటగదులు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని, విద్యుత్, తాగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.