ప్రభుత్వ బడిపై నమ్మకం చాటిన గ్రామ పాలకవర్గం
బెజ్జంకి, జూన్ 17: ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసాన్ని పెంపొందించేలా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పేరకబండ గ్రామ పాలకవర్గం ఆదర్శంగా నిలిచింది. గ్రామ సర్పంచ్ కర్రావుల స్వప్న మల్లేశం, ఉప సర్పంచ్ పోతుల అరుణ్ కుమార్, వార్డ్ సభ్యుడు కర్రావుల ఆనంద్ తమ కుమారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తమ నమ్మకాన్ని చాటారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తున్న గ్రామ పాలకవర్గం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ అమృత, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని గ్రామ పాలకవర్గాన్ని అభినందించారు.






