కోతుల నుండి రక్షించేవారేరీ..?
వందల సంఖ్యలో రోడ్లు, ఇండ్లపై సంచారం
గుమ్మడిదల, జూన్ 17 : నిత్యం రోడ్డు బయటకు వెళ్లాలంటే కోతులతో సాహసం చేయక తప్పడం లేదు. వందల సంఖ్యలో కోతుల మంద రోడ్లు, ఇండ్లపై విరుచుకుపడడంతో ప్రజలు భయపడుతున్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి వీరభద్ర నగర్ కాలనీలో కోతులను పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. వార్డు ప్రజలు, మహిళలు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు వెళ్లడానికి రోడ్డుమీద ఉన్న వానర సైన్యాన్ని చూసి భయపడుతున్నారు.
అంతేకాకుండా తలుపులు కాస్త తెరిచి ఉంటే చాలు ఏకంగా ఇంట్లోకి వచ్చి తిను బండారాలను తీసుకెళ్తున్నాయి. అప్పటికి ప్రజలు పక్కదారి నుండి వెళ్లిన అవి వారిని భయపెట్టించడంతో ఈ కోతుల బెడద ఎప్పుడు తొలగుతుందో అని ఎదురుచూస్తున్నారు. గతంలో నాయకులు కొన్ని గ్రామాలలో ఈ కోతుల బెడద తీర్చగా బొంతపల్లి వార్డు ఏం పాపం చేసిందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, పాలకులు స్పందించి కోతుల నుండి రక్షించాలని కోరుతున్నారు.






