మండల సమైక్య ఏపీఎం,సీసీలపై చర్యలు తీసుకోవాలి
సీఐటియు జిల్లా కార్యదర్శి రాజేందర్
సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్‌కు వినతిపత్రం అందజేత
కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండల సమైక్యంలో పనిచేస్తున్న 12 మంది VOAలకు సంబంధించిన గ్రేడింగ్ విధానాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో, సెర్ఫ్ విభాగం నుండి రావాల్సిన వేతనాలు నిలిచిపోయి వారు కుటుంబాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఐటియు జిల్లా కార్యదర్శి రాజేందర్ తెలిపారు.ఈ సమస్యను పలుమార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. గ్రేడింగ్ విధానాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడంతో వేతనాలు చెల్లింపులో జాప్యం జరుగుతోందని, దీనికి బాధ్యులైన APM మరియు CCలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సెర్ఫ్ సీఈఓ స్పందిస్తూ, ఒక వారం రోజుల్లో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒకవేళ ఆ సమయంలో కూడా వేతనాలు చెల్లించకపోతే మళ్లీ తన దృష్టికి తీసుకురావాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని వేతనాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యోతి, ఫైమా, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




