11 March, 2026 | 8:37 PM

గ్రామ పంచాయతీ వాహనాన్ని ప్రైవేటు పనులకు వాడుతున్న వారిపై చర్యలు

11-03-2026 07:02 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మండలం ఈదులవాడ గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను ప్రైవేటు పనులకు వాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో చెత్త తొలగింపు తదితర గ్రామపంచాయతీ పనుల కోసం వినియోగించాల్సిన ట్రాక్టర్‌ను ప్రైవేట్ వ్యక్తుల పశువుల కొట్టాన్ని తరలించేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపించారు.

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ట్రాక్టర్‌ను ఆపి ప్రశ్నించారు. గత 15 రోజుల క్రితం నాళాల్లో తొలగించిన పూడికను ఇప్పటివరకు ఎత్తకుండా వదిలిపెట్టి, ప్రైవేట్ వ్యక్తుల పనుల కోసం ట్రాక్టర్‌ను వాడటం ఎంతవరకు సమంజసం అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను ప్రైవేట్ పనుల కోసం వాడుతున్న కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్‌లపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.