06-12-2025 10:30:05 PM
* ఎన్నికల ప్రచారాలలో నిబంధనలు పాటించాలి
* జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో నియమాలు పాటించాలని, ర్యాలీలు, సభలకు తహసీల్దార్ అనుమతి తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యిందని, ఆయా గ్రామాల్లో క్యాంపియన్ నడుస్తుందన్నారు. మొదటి పేజ్ ఎన్నికల కోసం డిసెంబర్ 11న పోలింగ్ ఉన్నందున డిసెంబర్ 10న ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకోవాలని ఆదేశించారు. మొదటి ఫేజ్ లో ఆరు మండలాల్లో సర్పంచి వార్డు సభ్యులకు జరిగే ఎన్నికలను అత్యంత పారదర్శకంగా జరగాలని తెలిపారు.
మొదటి పేజ్ లో 14 గ్రామ పంచాయతీల సర్పంచి, వార్డు సభ్యులు, ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తయిన కూడా ఆయా గ్రామాల్లో ఎన్నికల నియమావళి కొనసాగుతుందన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదులు అందితే ఫ్లైయింగ్ స్కాడ్ టీములు దర్యాప్తు చేసి ఎన్నికల నియమాల ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గ్రామాల్లో 100% ఓటింగ్ సాధించాలన్నారు. 100% ఓటింగ్ జరిగిన గ్రామ పంచాయతీలను ఘనంగా సన్మానించి, ప్రత్యేక బహుమతులు అందిస్తామని తెలియజేశారు. ఓటింగ్ లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీవో విష్ణువర్ధన్ తో పాటు ఎన్నికల అధికారులు, సిబ్బంది ఉన్నారు.