గ్రామపంచాయతీ స్థలంలో ఇంటి నిర్మాణాన్ని నిలిపివేయాలని వ్యక్తి నిరసన
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రభుత్వ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్న నిర్మాణ పనులను నిలిపివేయాలని బుధవారం పోచారం గ్రామానికి చెందిన జగన్ రెడ్డి అనే వ్యక్తి ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ రెడ్డి మాట్లాడుతూ... పోచారం గ్రామానికి చెందిన కర్రోళ్ల శ్యామల భర్త కిరణ్ తన సొంత స్థలంలో కాకుండా గ్రామ పంచాయతీకి సంబంధించిన రెవెన్యూ ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపడుతుందన్నారు.
ఈ అక్రమ నిర్మాణంపై చర్యలు చేపట్టాలని కోరుతూ గత ఫిబ్రవరి 23వ తేదీన జిల్లా కలెక్టర్కు ప్రజావాణి కార్యక్రమంలో నాగిరెడ్డిపేట తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశానని తెలిపారు. ఫిర్యాదు చేసి 20 రోజులు గడుస్తున్నపటికీ స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీవోగాని ఇతర అధికారులు ఎవరు కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామ పంచాయతీ ప్రభుత్వ స్థలంలో అక్రమ ఇంటి నిర్మాణం చేపడుతున్న పనులను నిలిపివేయాలని కోరుతున్నామన్నారు.




