29 July, 2026 | 1:54 AM

నటి పావలా శ్యామల కన్నుమూత

29-07-2026 01:06 AM

ప్రముఖ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల(75) కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావటంతో మంగళవారం తెల్లవారుజామున 1:52 గంటలకు గుండెపోటుతో మృతిచెందారు.

దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆమె భౌతికకాయాన్ని ఉస్మానియా మార్చురీ నుంచి వనస్థలిపురంలోని ‘రెడీ టూ సర్వ్ ఫౌండేషన్’ వృద్ధాశ్రమానికి తరలించారు. బంధువులు, అభిమానుల సందర్శనార్థం ఇక్కడికి తరలించామని, వృద్ధాశ్రమం నిర్వాహకుడు శంకర్ తెలిపారు. శ్యామల అంత్యక్రియల పూర్తి బాధ్యతలను ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) స్వీకరించింది. బుధవారం 11 గంటలకు ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ‘మా’ జాయింట్ సెక్రటరీ కరాటే కల్యాణి తెలిపారు. 1951లో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో జన్మించిన పావలా శ్యామల అసలు పేరు నేతి శ్యామల. గణేశ్ పాత్రో రాసిన ‘పావలా’ నాటకంతో శ్యామలకు పేరు వచ్చింది.

దీంతో అప్పట్నుంచి ఆమె ‘పావలా’ శ్యామల అయ్యారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన శ్యామల.. పదో తరగతి వరకు చదువుకున్నారు. నాటక రంగంతో నటనలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత సినీ పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న శ్యామల.. 1985లో ‘బాబాయ్ అబ్బాయ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ‘స్వర్ణకమలం’ చిత్రంతో గుర్తింపు పొందారు. ‘ఖడ్గం’లో సహాయ నటి పాత్రలో విశేషంగా ఆకట్టుకున్నారు. పావలా శ్యామల కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో జీవన పోరాటం సాగిస్తున్నారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన నటి, చివరి రోజుల్లో ఇంతటి దయనీయ స్థితిలో కన్నుమూయడం అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది.