కేవీలో పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయం (కేవీ)లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానంలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం తనిఖీ చేశారు. పదో తరగతి వార్షిక పరీక్షలలో భాగంగా మ్యాథ్స్ పరీక్ష జరుగుతున్న సందర్భంగా పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు.
పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రంలో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, తాగునీరు మరియు ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిశీలనలో కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ శేషా ప్రసాద్, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు, తదితరులు పాల్గొన్నారు.






