మూడు నిమిషాల్లోనే యూరియా స్టాక్ ఖాళీ..! రైతులకు నిరాశ
4,002 బస్తాలు అందుబాటులోకి వచ్చినా రైతులకు నిరాశ
ఆన్‌లైన్ బుకింగ్ విధానంపై ప్రశ్నలు – సొసైటీ వారీగా పంపిణీ చేయాలని డిమాండ్
భిక్కనూర్, జూన్ 16 (విజయక్రాంతి): ఖరీఫ్ సాగు పనులు ఊపందుకున్న వేళ భిక్కనూర్ మండల(Bhikkanoor Mandal) రైతులకు యూరియా కొరత ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ శాఖ ప్రకటించిన ప్రకారం మండలానికి మొత్తం 4,002 యూరియా బస్తాలు అందుబాటులోకి వచ్చాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆన్‌లైన్ బుకింగ్(Online Urea Booking) ప్రారంభమవుతుందని వ్యవసాయ అధికారి నాగరాజు ముందుగానే ప్రకటించారు. అయినప్పటికీ బుకింగ్ ప్రారంభమైన మూడు నిమిషాల్లోనే ‘నో స్టాక్’ సందేశం రావడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ఏ సొసైటీలో ఎంత యూరియా..?
వ్యవసాయ శాఖ వివరాల ప్రకారం భిక్కనూర్ సొసైటీలో 444 బస్తాలు, బస్వాపూర్‌లో 444, రామేశ్వర్‌పల్లిలో 444, తిప్పాపూర్‌లో 444, జంగంపల్లిలో 444, అంతంపల్లిలో 444, పెద్దమల్లారెడ్డిలో 888 బస్తాల యూరియా అందుబాటులో ఉంచారు. అదనంగా మన గ్రోమోర్ కేంద్రంలో 450 బస్తాలు నిల్వ ఉన్నట్లు ఎంఏఓ నాగరాజు తెలిపారు.
మూడు నిమిషాల్లోనే నో స్టాక్
మధ్యాహ్నం 3 గంటలకు బుకింగ్ ప్రారంభమైన వెంటనే రైతులు యాప్‌లో లాగిన్ అయ్యారు. అయితే కేవలం మూడు నిమిషాల్లోనే స్టాక్ పూర్తైందని యాప్‌లో చూపించడంతో రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వేల సంఖ్యలో బస్తాలు అందుబాటులో ఉన్నప్పటికీ సాధారణ రైతులకు బుకింగ్ అవకాశం ఎందుకు దక్కలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
సొసైటీ పరిధి రైతులకు ప్రాధాన్యత లేదా?
ప్రస్తుతం ఒక సొసైటీకి కేటాయించిన యూరియాను మండలంలోని ఏ గ్రామ రైతైనా బుక్ చేసుకునే అవకాశం ఉంది. దీంతో కొన్ని నిమిషాల్లోనే స్టాక్ పూర్తవుతోందని సొసైటీ చైర్మన్లు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత గ్రామ రైతులు తమ సొసైటీలోనే బుకింగ్ చేసుకునే విధానం అమలు చేస్తే సమానంగా పంపిణీ జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
సాంకేతిక సమస్యలతో రైతుల ఇబ్బందులు
స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం లేని రైతులు బుకింగ్ ప్రక్రియలో వెనుకబడుతున్నారు. యాప్ పనిచేయకపోవడం, ఓటీపీ ఆలస్యంగా రావడం, సర్వర్ సమస్యలు కూడా రైతులకు ఇబ్బందిగా మారాయని వారు పేర్కొంటున్నారు.
అధికారుల జోక్యం కోరుతున్న రైతులు
యూరియా కోసం రైతులు సహకార సంఘాలు, ఎరువుల కేంద్రాల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచడంతో పాటు బుకింగ్ విధానాన్ని పునఃసమీక్షించాలని, సొసైటీ వారీగా పంపిణీ వ్యవస్థ అమలు చేయాలని రైతులు, సొసైటీ చైర్మన్లు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. రైతులకు నిజంగా యూరియా అందేలా పారదర్శక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సొసైటీ వారీగా యూరియా బుకింగ్ అమలు చేయాలి: పెద్దమల్లారెడ్డి సొసైటీ చైర్మన్ బాలాగౌని రాజాగౌడ్

"ప్రస్తుతం ఒక సొసైటీకి కేటాయించిన యూరియాను మండలంలోని ఏ గ్రామ రైతైనా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో కొద్ది నిమిషాల్లోనే స్టాక్ పూర్తవుతోందని పెద్దమల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బాలాగౌని రాజాగౌడ్ తెలిపారు. దీంతో ఆయా సొసైటీల పరిధిలోని రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రతి గ్రామ రైతు తన గ్రామానికి సంబంధించిన సొసైటీలోనే యూరియా బుక్ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని ఆయన కోరారు. అలా చేస్తే ఎరువుల పంపిణీ పారదర్శకంగా జరిగి, రైతులందరికీ సమానంగా యూరియా అందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్ బుకింగ్ విధానంలో మార్పులు తీసుకురావాలని, సరిపడా యూరియా నిల్వలను అందుబాటులో ఉంచాలని అధికారులను కోరారు."






